![]() |
![]() |

టాలీవుడ్ లో హీరో-డైరెక్టర్ కాంబినేషన్ గురించి ప్రస్తావన వస్తే అందులో చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబో గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆ కాంబినేషన్ ఎన్నో సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రెస్. ఇండస్ట్రీ హిట్స్ ని, బ్లాక్ బస్టర్స్ ని అందించిన అసలుసిసలు హిట్ కాంబో వారిది. వారి కలయికలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ లో 'ముఠా మేస్త్రి'(1993) ఒకటి. ఈ సినిమా నేటితో 30 వసంతాలు పూర్తి చేసుకుంది.
'న్యాయం కావాలి', 'అభిలాష', 'ఖైదీ', 'ఛాలెంజ్', 'విజేత', 'పసివాడి ప్రాణం' వంటి ఎన్నో ఘన విజయాల తర్వాత చిరంజీవి-కోదండరామిరెడ్డి కలయికలో 1993 లో వచ్చిన సినిమా 'ముఠా మేస్త్రి'. కూలీ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి.. దుర్మార్గుల ఆట కట్టించడం కోసం మళ్ళీ కూలీగా మారే బోసు పాత్రలో చిరంజీవి అలరించాడు. ఆయన నటన, ఫైట్లు, డ్యాన్స్ లు చూడటానికి మాస్ పెద్ద ఎత్తున థియేటర్ల బాట పట్టడంతో ఈ మంచి వసూళ్లు రాబట్టి విజయం సాధించింది. చిరంజీవి కెరీర్ లో మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాల్లో 'ముఠా మేస్త్రి' కూడా ముందు వరుసలో ఉంటుంది.
కె.సి.శేఖర్‌బాబు, డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రోజా, మీనా, రత్ సక్సేనా, మన్సూర్ ఆలీ ఖాన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, జె. వి. సోమయాజులు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పరుచూరి సోదరులు సంభాషణలు అందించిన ఈ చిత్రానికి ఎస్. గోపాల రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. రాజ్-కోటి స్వరపరిచిన పాటలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. 'ఈ పేటకి నేనే మేస్త్రి', 'అంజనీపుత్రుడా వీరాధివీరుడా', 'ఎంత ఘాటు ప్రేమయో', 'చికి చికి చాం' ఇలా పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి.
![]() |
![]() |