మొదటి సినిమా 'దసరా'తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. నాని, కీర్తి సురేష్ జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 30న విడుదలై రూ.100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. మొదటి సినిమాతోనే వంద కోట్ల దర్శకుడిగా పేరు తెచ్చుకోవడంతో.. అప్పుడే శ్రీకాంత్ ఓదెల రెండో సినిమా ఏ హీరోతో చేస్తాడనే చర్చలు మొదలయ్యాయి. ఆయన తన రెండో సినిమాని అఖిల్ అక్కినేని చేయబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత అఖిల్ చేయబోయే సినిమా గురించి ఇంతవరకు ప్రకటన రాలేదు. అయితే అఖిల్ తన తదుపరి చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'దసరా'ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి నే ఈ సినిమాని కూడా నిర్మించనున్నారని సమాచారం.
నిర్మాతగా సుధాకర్ చెరుకూరికి దసరా నే మొదటి విజయం. 'విరాట పర్వం' వంటి సినిమాలు పేరు తీసుకొచ్చాయి గానీ కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాయి. అందుకే దసరా సక్సెస్ ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దర్శకుడు శ్రీకాంత్ కి ఆయన ఒక ఖరీదైన కారుని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. అంతేకాదు ఇప్పుడు శ్రీకాంత్ దర్శకత్వంలో రెండో సినిమాని కూడా ఆయనే నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే అఖిల్-శ్రీకాంత్ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయని, 'ఏజెంట్' విడుదల తర్వాత ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.