నాని కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో 'ఎంసీఏ'(మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా ముందు వరుసలో ఉంటుంది. నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం 2017 డిసెంబరులో విడుదలై రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో భూమిక ముఖ్య పాత్ర పోషించింది. కుటుంబ కోసం ఓ మధ్యతరగతి యువకుడు సాగించిన పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. ఈ సీక్వెల్ లో నితిన్ హీరోగా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
2011 లో విడుదలైన 'ఓ మై ఫ్రెండ్' చిత్రంతో వేణు శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అది విడుదలైన ఆరేళ్లకు 2017 లో ఆయన రెండో సినిమా 'ఎంసీఏ' విడుదల కాగా.. అది విడుదలైన మరో నాలుగేళ్లకు 2021 లో మూడో సినిమాగా 'వకీల్ సాబ్' విడుదలైంది. ఈ మూడు చిత్రాలను దిల్ రాజే నిర్మించడం విశేషం. మధ్యలో అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్' సినిమాని ప్లాన్ చేయగా.. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్న వేణు శ్రీరామ్.. ఇప్పుడు తన నాలుగో సినిమాని కూడా దిల్ రాజు నిర్మాణంలోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని, ఇందులో నితిన్ హీరోగా నటించనున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే ఇది 'ఎంసీఏ'కు సీక్వెల్ అనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి నితిన్ తో వేణు శ్రీరామ్ చేయబోయేది 'ఎంసీఏ' సీక్వెలా? లేక వేరే కథనా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.