'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి 'వార్-2'లో నటించబోతున్నాడు. ఈ మూడు ప్రాజెక్ట్ లు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలే కావడం కావడం. వీటితో పాటు మరో భారీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ నటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 'గేమ్ ఛేంజర్' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు రాబోయే రోజుల్లో పాన్ ఇండియా రేంజ్ లో పలు భారీ ప్రాజెక్ట్ లు చేయబోతున్నట్లు ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. వాటిలో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'జటాయు' కూడా ఉంది. అయితే యువ హీరోలతో లవ్ స్టొరీలు, మీడియం రేంజ్ సినిమాలు చేసే ఇంద్రగంటితో భారీ సినిమా తీయడానికి దిల్ రాజు సిద్ధపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో మైథలాజికల్ టచ్ ఉన్న ఈ భారీ సినిమాలో హీరోగా ఎవరనే చర్చ కూడా జరిగింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. మైథాలజి సినిమాలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరు. పైగా ఎన్టీఆర్ ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయప్రవేశం చేయగలడు. అందుకే ఈ భారీ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల దిల్ రాజు సైతం త్వరలో ఎన్టీఆర్ తో ఓ సినిమా ఉంటుందని, చర్చలు జరుగుతున్నాయని అన్నాడు. దీంతో దిల్ రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా 'జటాయు' అయ్యుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.