నటసింహం నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' షో కోసం హోస్ట్ అవతారం ఎత్తినప్పటి నుంచి.. ఆయన హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఒక సినిమా నిర్మించనున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
ఈ ఏడాది సంక్రాంతికి 'వీరసింహారెడ్డి' సినిమాతో విజయాన్ని అందుకున్న బాలకృష్ణ.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాని చేస్తున్నాడు. ఈ మూవీ దసరాకు విడుదలయ్యే అవకాశముంది. దీని తర్వాత బాలయ్య చేయబోయే సినిమాపై కూడా క్లారిటీ వచ్చినట్లే అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఆయన తదుపరి సినిమా చేయనున్నారని టాక్. దీనికి పరశురామ్ లేదా చందు మొండేటి దర్శకత్వం వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేసి అల్లు అరవింద్ కి వినిపించినట్లు గతంలో ఓ సినిమా వేడుకలో పరశురామ్ ప్రకటించాడు. దాంతో అల్లు అరవింద్ నిర్మాణంలో బాలయ్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సినిమా అంటూ అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి. మరోవైపు చందు మొండేటి సైతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ చిత్రాన్ని కమిట్ అయ్యి ఉన్నాడు. దీంతో గీతా ఆర్ట్స్ లో బాలయ్య సినిమా పరశురామ్ తోనా? లేక చందు మొండేటితోనా? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.