'కాంతార' సినిమాతో కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధించి రిషబ్ శెట్టిని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. 'కాంతార' సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదల సమయంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెలుగు సినిమా చేస్తామని అన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించే అవకాశముందని వినికిడి.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్న విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా, పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు. నిజానికి విజయ్-పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన గీతా ఆర్ట్స్ వీరి కాంబోలో మరో సినిమాని ప్లాన్ చేసింది. అయితే వీరు అనూహ్యంగా దిల్ రాజు నిర్మాణంలో సినిమాని ప్రకటించారు. దాంతో అల్లు అరవింద్ హర్ట్ అయ్యారు. అయితే గీతా ఆర్ట్స్ లో మరో సినిమా చేస్తానని విజయ్ ప్రత్యేకంగా చెప్పడంతో అరవింద్ కాస్త కూల్ అయ్యారట. అంతేకాదు ఇప్పుడు విజయ్- రిషబ్ శెట్టి కాంబినేషన్ లో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం 'కాంతార-2' పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక విజయ్-రిషబ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని అంటున్నారు.