రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ k'. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ని 2024 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇది శ్రీ మహా విష్ణు దశావతారాలు కాన్సెప్ట్ తో రూపొందుతోందని, నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది మొదటి భాగమని టాక్ వినిపిస్తోంది.
'ప్రాజెక్ట్ k'లో విష్ణువు యొక్క మోడరన్ అవతారం గురించి ఉంటుందని, ఇందులో ఫాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ అంశాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే నిర్మాత అశ్వనీదత్ చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. దశావతారాలు కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ ఓ భారీ సినిమాటిక్ యూనివర్స్ ని ప్లాన్ చేశాడట. అందులో భాగంగా మొదటి సినిమాగా 'ప్రాజెక్ట్ k' రానుందట. దశావతారాలను మోడరన్ గా మార్చి ఒక్కో భాగంలో ఒక్కో అవతారాన్ని థీమ్ గా తీసుకుంటారట. భూత, భవిష్యత్ కాలాలను కలుపుతూ నాగ్ అశ్విన్ తీయనున్న ఈ సినిమాటిక్ యూనివర్స్ లో.. ఒక్క అవతారంలో ఒక్కో స్టార్ హీరో నటించనున్నారట. 'ప్రాజెక్ట్ k' విడుదల తర్వాత మిగతా భాగాలపై స్పష్టత వచ్చే అవకాశముందని అంటున్నారు. ఈ వార్త నిజమైతే మాత్రం, ఇది పాన్ వరల్డ్ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.