ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీపై యంగ్ హీరోస్ కామెంట్స్!
on Mar 24, 2025
స్టార్ హీరోల కెరీర్ లో బ్లాక్ బస్టర్ లు, డిజాస్టర్ లు కామన్. అయితే డిజాస్టర్ సినిమాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరు, వాటి గురించి ఎక్కువగా మాట్లాడరు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్లాప్ మూవీస్ లో ఒకటైన 'నా అల్లుడు' గురించి మాత్రం యంగ్ హీరోలు మాట్లాడుతుండటం ఆసక్తికరంగా మారింది. (Jr NTR)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వర ముళ్ళపూడి దర్శకత్వంలో రూపొందిన 'నా అల్లుడు' మూవీ 2005లో విడుదలై పరాజయం పాలైంది. ఇందులో మురుగన్ గా ఎన్టీఆర్ నవ్వులు పూయించాడు. పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. కానీ, సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ ఫ్లాప్ సినిమాని రీమేక్ చేయాలని, రీ రిలీజ్ చేయాలని యంగ్ హీరోలు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
ఎన్టీఆర్ ని యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎంతగానో అభిమానిస్తాడనే విషయం తెలిసిందే. 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీ ప్రమోషన్స్ లో విశ్వక్ కి.. "ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఏది రీమేక్ చేయాలనుకుంటున్నారు?" అనే ప్రశ్న ఎదురైంది. దానికి విశ్వక్ ఎవరూ ఊహించని విధంగా 'నా అల్లుడు' అని సమాధానమిచ్చాడు. ఆ సినిమా బాగుంటుందని, కొన్ని మార్పులతో బాగా తీయొచ్చని అభిప్రాయపడ్డాడు.
ఇక తాజాగా ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ సైతం 'నా అల్లుడు' సినిమా తనకి ఇష్టమని చెప్పాడు. 'మ్యాడ్ స్క్వేర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా "ఏ మూవీ రీ-రిలీజ్ కోరుకుంటున్నారు" అని ప్రశ్న ఎదురు కాగా.. 'నా అల్లుడు' అని చెప్పాడు నితిన్. "బావ పాత సినిమాల్లో నాకు నా అల్లుడు ఇష్టం. అది అప్పుడు వర్కౌట్ అవ్వలేదు కానీ, అందులో ఫన్ చాలా బాగుంటుంది. నా అల్లుడు రీ రిలీజ్ అయితే చూడాలని ఉంది." అని నితిన్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా ఇష్టమని ఇద్దరు హీరోలు చెప్పారు. భవిష్యత్ లో ఈ లిస్టు ఇంకా పెరుగుతుందేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
