రిషబ్ శెట్టికి షాక్ తప్పదా.. ‘కాంతార’ ప్రీక్వెల్ ఫ్లాప్ అవుతుందా?
on Apr 4, 2025
సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే.. ఆ సినిమాకి వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని సీక్వెల్స్ చేస్తుంటారు. ఈ విషయంలో హాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. హాలీవుడ్ చరిత్రలో ఎన్నో సినిమాలు లెక్కకు మించిన భాగాలుగా వచ్చాయి. సాధారణంగా సీక్వెల్ ఏదైనా మొదటి భాగానికి కొనసాగింపుగా రెండో భాగం ఉంటుంది. అలా కాకుండా వచ్చిన సినిమాలోని కథకు అంతకుముందు ఏం జరిగింది అనేది చూపించడం ఒక కొత్త ప్రక్రియ అని చెప్పొచ్చు. ఇటీవలే ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అయితే 2012లోనే తమిళ్లో ఓ సినిమాకి ఇలాంటి ప్రయోగం చేశారు. 2007లో అజిత్ హీరోగా విష్ణువర్థన్ డైరెక్షన్లో వచ్చిన ‘బిల్లా’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2012లో చక్రి తోలేటి దర్శకత్వంలో తమిళ్లో ‘బిల్లా2’ ప్రీక్వెల్ చేశారు. తెలుగులో ఈ సినిమాను ‘డేవిడ్ బిల్లా’ పేరుతో విడుదల చేశారు. డేవిడ్ బిల్లా అనే వ్యక్తి బిల్లాగా ఎలా మారాడు అనే కథాంశంతో ఆ సినిమాను రూపొందించారు. అయితే అది అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అలాగే 1994లో యానిమేషన్ మూవీగా వచ్చిన ‘ది లయన్ కింగ్’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. అదే కథతో 2019లో 3డి యానిమేషన్లో ఎంతో నేచురల్‌గా రూపొందించిన ‘ది లయన్ కింగ్’ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి కూడా సీక్వెల్ తియ్యకుండా ప్రీక్వెల్ చేశారు. లయన్ కింగ్‌లో ముఫాసా అనే క్యారెక్టర్ మరణిస్తుంది. ‘ముఫాసా ది లయన్ కింగ్’ పేరుతో ఆ సినిమాకి ప్రీక్వెల్ రూపొందించారు. ఇందులో ముఫాసా చిన్న తనం నుంచి అడవికి రాజుగా ఎదిగే క్రమాన్ని తెరకెక్కించారు.
ఇటీవల విక్రమ్ హీరోగా ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘వీరధీరశూరన్’ చిత్రాన్ని రెండో భాగంగా విడుదల చేశారు. దీనికి సంబంధించిన మొదటి భాగం త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఖైదీ’ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఓపెనింగ్‌లోనే హీరో జైలు నుంచి రిలీజ్ అవుతాడు. ఆ హీరో పదేళ్ళపాటు జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే కథాంశంతో ‘ఖైదీ’ ప్రీక్వెల్ రూపొందనుంది.
2022లో రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ సంచలన విజయం సాధించింది. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా 400 కోట్లకి పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై వున్న భారీ అంచనాల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి 200 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు మేకర్స్. కాంతార వెనుక చాలా చరిత్ర ఉందని, ఛాప్టర్ 1లో దాన్ని విస్తృత స్థాయిలో తెరకెక్కించబోతున్నట్టు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు రూపొందిన ప్రీక్వెల్స్ని పరిశీలిస్తే.. మొదట రిలీజ్ అయిన సినిమాలే ఘనవిజయాలు అందుకున్నాయి తప్ప ఆ తర్వాత ప్రీక్వెల్ పేరుతో విడుదలైన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవ్వగా, మరికొన్ని ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేకపోయాయి. ‘బిల్లా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘డేవిడ్ బిల్లా’ బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. హాలీవుడ్లో ఈ తరహా ప్రయోగాలు అనేకం జరిగి ఉంటాయి. కానీ, ఇండియాలో రిలీజ్ అయిన ‘ది లయన్ కింగ్’ పరిస్థితి కూడా అదే. 1994లో యానిమేషన్లో వచ్చిన ఈ సినిమా 45 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. 1998లో ది లయన్ కింగ్ 2గా ప్రీక్వెల్‌ను నిర్మించారు. కానీ, ఈ సినిమా విజయం సాధించలేదు. 2019లో 3డి యానిమేషన్లో వచ్చిన ది లయన్‌కింగ్ చిత్రాన్ని 260 మిలియన్ డాలర్లతో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై 1650 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. 2024లో దీనికి ప్రీక్వెల్‌గా వచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ 300 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే కేవలం 700 మిలియన్ డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రీక్వెల్స్ని పరిశీలిస్తే.. ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కాంతార ఛాప్టర్ 1పై డిస్కషన్ జరుగుతోంది. ఈ సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుంది అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ప్రీక్వెల్స్ హిట్ అవ్వలేదు అనే సెంటిమెంట్‌ని బ్రేక్ చేసేందుకు హోంబలె ఫిలింస్ అధినేతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కాంతార ఛాప్టర్1ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఖైదీ, వీరధీరశూరన్ చిత్రాలు కూడా ప్రీక్వెల్స్‌గా రాబోతున్నాయి. మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
