కోర్టుకెక్కిన మహోన్నత వ్యక్తి బయోపిక్.. ఒకే కథతో తెరకెక్కుతున్న రెండు సినిమాలు!
on Mar 28, 2025
సినిమా ఇండస్ట్రీలో రకరకాల వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు టైటిల్ గురించి వివాదం నడుస్తుంది. కొన్ని సందర్భాల్లో తన కథ కాపీ కొట్టారంటూ ఒకరు కేసు పెడతారు. ఇలాంటి వివాదాలు సర్వసాధారణం. అయితే ఇప్పుడు మరో కొత్త వివాదం కోర్టు వరకు వెళ్లింది. అది కూడా ఒక బయోపిక్ కావడం విశేషం. రామకృష్ణ దర్శకత్వంలో ‘డొక్కా సీతమ్మ’ పేరుతో వి.ప్రభాకర్‌గౌడ్ ఓ బయోపిక్‌ను నిర్మిస్తున్న ప్రకటించారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెట్స్‌కి వెళ్ళకముందే ఈ సినిమా చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. అదే కథతో మరో సంస్థ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలుసుకున్న ప్రభాకర్‌గౌడ్ కోర్టును ఆశ్రయించారు.
2016లో డొక్కా సీతమ్మ స్క్రిప్ట్‌ని తెలుగు రచయితల సంఘంలో రిజిస్టర్ చేశారు ప్రభాకర్‌గౌడ్. సినిమాను ప్రారంభించేందుకు సిద్ధపడుతుండగా మరొక సంస్థ ఇదే కథతో సినిమాను ప్లాన్ చేశారని తెలిసి కోర్టుకు వెళ్లారు. కాపీరైట్ యాక్ట్ తమకు ఉన్నప్పటికీ విషయం కోర్టులో ఉండడంతో సినిమాను నిర్మించేందుకు ముందుకు వెళ్లలేకపోతున్నామని నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కథతో ఇద్దరు నిర్మాతలు సినిమాలు తీసేందుకు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే డొక్కా సీతమ్మ అనే వ్యక్తి గురించి విననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోయింది. విదేశాల్లో సైతం ఆమె గురించి ప్రముఖంగా చెప్పుకుంటారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవితకథ తెరకెక్కడానికి ఇన్ని అవరోధాలు ఎదురుకావడం నిజంగా దురదృష్టమే.
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణగానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్తంగా ఉన్న లంకల గన్నవరం అనే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతాలలో తరచూ వచ్చే వరదల కారణంగా అతివృష్టి, అనావృష్టి ఏర్పడి పలు ఇబ్బందులకు గురవుతున్న ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకుంటూ తన ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహాఇల్లాలు. చదువు సంధ్యలు లేని సీతమ్మ ఓ సాధారణ స్త్రీ. నిత్యాన్నదానం చేయడం ద్వారా విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి అన్నదానానికి మించిన దానం లేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా ‘అతిథి దేవోభవ’ అన్నపదానికి ఉదాహరణగా నిలిచిన వ్యక్తి ఆమె.
ఆరోజుల్లోనే బ్రిటీష్ ప్రభుత్వం ఆమె ధాతృత్వాన్ని గుర్తించింది. కింగ్డ్ ఎడ్వర్డ్ ఆమెను తన వార్షికోత్సవానికి భారతదేశంలోని ఇతర అతిథులతో కలిసి రావాల్సిందిగా డొక్కా సీతమ్మను ఆహ్వానించారు. గౌరవంతో ఆమెను ఢల్లీికి తీసుకురావాలని ఆయన మద్రాస్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కానీ, మర్యాదగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు సీతమ్మ. ప్రచారం కోసం తాను సేవలను అందించడం లేదని స్పష్టం చేశారు. దాంతో మద్రాసు ప్రధాన కార్యదర్శి.. సీతమ్మకు బదులుగా ఆమె ఫోటోను తీసుకొని వెళ్లారు. ఆ వేడుకలో సీతమ్మకు కేటాయించిన కుర్చీపై ఆ ఫోటోను ఉంచి ఆమెపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు కింగ్ ఎడ్వర్డ్. అంతటి మహనీయ చరిత్ర కలిగిన డొక్కా సీతమ్మ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఇన్ని అవాంతరాలు ఎదురు కావడం గమనార్హం. ఆమె గొప్పదనాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన ఫథకానికి ‘డొక్కా సీతమ్మ’ పేరు పెట్టింది. అన్నా క్యాంటీన్ల మాదిరిగానే డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు ప్రారంభిస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరడం విశేషం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
