సాయిపల్లవి సీరియస్ వార్నింగ్.. ఇకపై లీగల్ యాక్షన్ తప్పదు!
on Dec 12, 2024
ప్రస్తుతం సౌత్‌లో ఉన్న హీరోయిన్లలో సాయిపల్లవికి ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. ఎందుకంటే సినిమాల్లో ఆమె చేసే క్యారెక్టర్లుగానీ, నిజ జీవితంలో ఆమె బిహేవియర్గానీ అందరూ ఇష్టపడతారు. ఎలాంటి వివాదాల్లోకి రాకపోవడం, ఎవరినీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం వంటి విషయాలు సాయిపల్లవిని అభిమానించడానికి కారణాలు. ఇటీవల సోషల్ మీడియాలో ఏ విషయాన్నయినా పోస్ట్ చేయడం, కామెంట్ చేయడం చాలా మందికి కామన్‌గా మారిపోయింది. ఎవరైనా ఆమెను కామెంట్ చేస్తే దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోవడమే కాదు, ఎంతో సున్నితంగా వారికి సమాధానమిస్తుంటుంంది.
ఏ రాష్ట్రం వారు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లోని వారు మాత్రం సాయిపల్లవిని ఎలాంటి వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేయరు. అలాంటిది సోషల్ మీడియాలో వచ్చిన ఓ రూమర్‌పై ఆమె తీవ్రంగా స్పందించడమే కాదు, వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై లీగల్ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎప్పుడూ కోపం తెచ్చుకోకుండా ఎంతో సైలెంట్‌గా ఉండే సాయిపల్లవికి అంతగా కోపం తెప్పించిన ఆ రూమర్ ఏమిటి అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఎక్స్ వేదికగా ఆ రూమర్‌పై తన రియాక్షన్‌ను చూపించింది. ఇంతకీ సాయిపల్లవి ఎక్స్ ద్వారా ఏం కామెంట్ చేసిందంటే.. ‘నా గురించి ఏదైనా నిరాధారమైన పుకార్లుగానీ, కల్పిత వార్తలుగానీ, తప్పుడు ప్రకటనలుగానీ వచ్చినప్పుడల్లా నేను మౌనంగా ఉండడానికే ఇష్టపడతాను. అది మీకు తెలుసు, ఆ దేవుడికి కూడా తెలుసు. ఇవి రెగ్యులర్‌గా వస్తుండడంతో నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తోంది. ముఖ్యంగా నా సినిమాల రిలీజ్ సమయాల్లో, నేను హ్యాపీ మూడ్‌లో వున్న సమయంలో నాపై ఇలాంటి కామెంట్స్ చేయడం నాకెంతో బాధ కలిగిస్తోంది. నాపై ఇలాంటి చెత్త రాతలు రాసేవారికి ఇదే లాస్ట్ వార్నింగ్. ఇకపై అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు’ అంటూ పోస్ట్ చేసింది.
సాయిపల్లవి పూర్తి శాకాహారి. అంతేకాదు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తప్ప బయటి ఫుడ్ తినడం అనేది చాలా తక్కువ. ఈ విషయంలో ఆమెకు ఎంతో డిసిప్లిన్ ఉంది. సాయిపల్లవి ప్రస్తుతం రామాయణం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ తమిళ మీడియా సంస్థ సాయిపల్లవిపై చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ఆ సినిమాలో నటిస్తోంది కాబట్టే నాన్ వెజ్ తినడం లేదని, బయటి ఫుడ్‌ని కూడా తీసుకోవడం లేదంటూ తమకు తోచిన విధంగా ఆ సంస్థ కామెంట్ చేసింది. దీన్ని చూసిన తర్వాతే సాయిపల్లవి అలా తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. ఆమె వేసిన పోస్ట్‌పై నెటిజన్లు ఎంతో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఆమె వార్నింగ్ ఇచ్చిన తీరును మెచ్చుకుంటున్నారు. ఇలాంటి రూమర్లు ఇకపై రాకుండా ఉండాలంటే అలాగే రియాక్ట్ అవ్వాలంటున్నారు. ఆమె పోస్టును ఇప్పటికే వేల సంఖ్యలో షేర్ చేశారు నెటిజన్లు.