హనుమంతుడి పాత్రలో రామ్ చరణ్.. మరి చిరంజీవి..?
on Jul 7, 2024
బ్లాక్ బస్టర్ మూవీ 'హనుమాన్'కి సీక్వెల్ గా రూపొందనున్న 'జై హనుమాన్' (Jai Hanuman)లో హనుమంతుడి పాత్ర ఎవరు పోషిస్తారు అనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. మొదట చిరంజీవి (Chiranjeevi) పేరు వినిపించింది. ఆ తర్వాత రానా (Rana) పేరు ప్రముఖంగా వినిపించింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) పేరు తెరపైకి వచ్చింది. చరణ్ పేరుని నిర్మాతే స్వయంగా చెప్పడం విశేషం.
'హనుమాన్'ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి 'డార్లింగ్' (Darling) అనే సినిమా వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత చైతన్య రెడ్డి.. 'జై హనుమాన్'లో హనుమంతుడి పాత్ర ఎవరు పోషిస్తే బాగుంటుంది అనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మేమైతే రామ్ చరణ్ కానీ, చిరంజీవి గారు కానీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి వీరు అవుతారా లేక వేరే స్టార్ అవుతారా అనేది హనుమంతుడు డిసైడ్ చేస్తాడు. నా పర్సనల్ ప్రిఫరెన్స్ అయితే రామ్ చరణ్ లేదా చిరంజీవి గారు. మేము దేవుడి కథ చెప్పాలనుకుంటున్నాం. ఆయన ఎలా చెప్పించుకుంటాడు, ఎవరితో చెప్పించుకుంటాడు అనేది ఆ దేవుడే నిర్ణయిస్తారు." అన్నారు.
నిర్మాత చైతన్య మాటలను బట్టి చూస్తే.. హనుమంతుడి పాత్రకు వారి మొదటి ఛాయిస్ రామ్ చరణ్ అని అర్థమవుతోంది. ఒకవేళ చరణ్ చేయకపోతే.. అప్పుడు చిరంజీవి లేదా వేరే స్టార్స్ చేసే అవకాశముంది.