డైరెక్టర్ మారుతికి షాకిచ్చిన ప్రభాస్..!
on Apr 2, 2025
ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ హీరోలంతా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. దీంతో స్టార్స్ నుంచి ఏడాదికి ఒక సినిమా రావడం గగనమైపోయింది. ఒక ప్రాజెక్ట్ షూట్ పూర్తయిన తర్వాతనే, మరో ప్రాజెక్ట్ ని మొదలుపెడుతున్నారు. కానీ, అందరికంటే ముందుగా పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ మాత్రం.. చేతినిండా సినిమాలతో, ఒకేసారి కనీసం రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? అంటే.. ఫ్యాన్స్ కూడా టక్కున చెప్పలేరు. అయితే ప్రభాస్ నుంచి నెక్స్ట్ వచ్చే మూవీ ఏంటంటే మాత్రం అందరూ కాన్ఫిడెంట్ గా చెప్పే సమాధానం 'ది రాజా సాబ్'. కానీ, ఇప్పుడు ఈ విషయంలోనూ సస్పెన్స్ నెలకొంది. 'రాజా సాబ్' కంటే ముందు.. ప్రభాస్ నుంచి మరో సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది. (Prabhas)
ప్రజెంట్ ప్రభాస్ చేతిలో 'రాజా సాబ్', 'ఫౌజి', 'స్పిరిట్', 'సలార్-2', 'కల్కి-2'తో పాటు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఉన్నాయి. వీటిలో మారుతి దర్శకత్వం వహిస్తున్న 'రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'రాజా సాబ్' మొదట పట్టాలెక్కింది. నిజానికి ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 10కి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఆ తేదీకి కూడా రావట్లేదు. కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలో అసలు 'రాజా సాబ్' మూవీ.. ఈ ఏడాది విడుదల కాకపోవచ్చనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. (The Raja Saab)
'రాజా సాబ్' ప్రభాస్ ఎంతో ఇష్టంతో చేస్తున్న చిత్రమట. ఈ సినిమాపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు అవుట్ పుట్ చెక్ చేసుకుంటున్నాడట. కొన్ని సీన్లు రీ షూట్ చేయాలని స్వయంగా ప్రభాస్ సూచించాడని వినికిడి. దీంతో షూటింగ్ కి మరింత సమయం పట్టనుంది. అలాగే వీఎఫ్ఎక్స్ వర్క్ కి కూడా ఎక్కువ సమయం కావాల్సి ఉంది. షూట్, వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో హడావుడి చేయకుండా.. కాస్త ఆలస్యమైనా మంచి అవుట్ పుట్ తో రావాలని ప్రభాస్ భావిస్తున్నాడట. 'రాజా సాబ్' తో పోలిస్తే, 'ఫౌజి'కి పెద్దగా వీఎఫ్ఎక్స్ పనిలేదు కాబట్టి.. ముందుగా వీలైనంత త్వరగా 'ఫౌజి' షూట్ ని పూర్తి చేసి, ఆ తర్వాత 'రాజా సాబ్'కి తగినంత ఎక్కువ సమయం కేటాయించాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడట. అదే జరిగితే, 'ఫౌజి' ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశముండగా.. 'రాజా సాబ్' వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
