సినీ కెరీర్ పై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్.. జరిగే పనేనా..?
on Mar 24, 2025
తెలుగునాట తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమా వచ్చిందంటే.. థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్.. కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీ కావడంతో సినిమాల్లో వేగం తగ్గింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడంతో.. పవన్ పూర్తిగా సినిమాలకు దూరమైనట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆయన చేతిలో 'హరి హర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు ఉండగా.. వాటిలో వీరమల్లు, ఓజీ మాత్రమే ఎలాగోలాగ పూర్తి చేస్తారని, ఉస్తాద్ పై ఆశలు వదులుకోవాల్సిందే అని కామెంట్స్ వినిపించాయి. అభిమానులు సైతం వీరమల్లు, ఓజీ నే పవన్ చివరి చిత్రాలనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తన సినీ కెరీర్ గురించి పవర్ స్టార్ ఊహించని కామెంట్స్ చేశారు.
తాజాగా తమిళ్ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీ కెరీర్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. "నాకు డబ్బు అవసరమైనంత కాలం, సినిమాలు చేస్తూనే ఉంటాను. అయితే పాలన వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి రాజీ పడకుండా.. రెండూ బ్యాలన్స్ చేసేలా ప్లాన్ చేస్తాను." అన్నారు.
పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడమే గొప్ప విషయం అని.. ఆయన కొత్త సినిమాలు కమిట్ అయ్యే అవకాశం లేదని ఇప్పటిదాకా అందరూ భావించారు. కానీ, తాజాగా పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తుంటే.. ఆయన భవిష్యత్ లో సినిమాలు కంటిన్యూ చేస్తారని అర్థమవుతోంది.
పవన్ గతంలోనూ ఇదే రకమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. తనకు వ్యాపారాలు లేవని.. అందుకే సినిమాలు చేసి డబ్బు సంపాదించి.. ఆ డబ్బుని పార్టీ కార్యకలాపాలకు, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని చెప్పారు. పవన్ సొంతంగా పార్టీని నడిపించడమే కాకుండా, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అవన్నీ జరగాలంటే.. తనకు తెలిసిన సినిమా ద్వారానే డబ్బు సంపాదించాలి. అయితే పవన్ ఆలోచన బాగానే ఉంది కానీ, అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి.
'హరి హర వీరమల్లు', 'ఓజీ' షూటింగ్ లు చివరి దశలో ఉన్నాయి. పవన్ డేట్స్ అందుబాటులో లేక ఈ రెండు సినిమాలు ఆలస్యమవుతున్నాయి. ముఖ్యంగా వీరమల్లు ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మే 9న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మే 9 కైనా వస్తుందో లేదో స్పష్టంగా చెప్పలేము. ఓజీకి కూడా పవన్ 30 రోజులు దాకా కేటాయించాల్సి ఉంది. ఆయన డేట్స్ కేటాయిస్తే.. ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికే పవన్ సమయం కేటాయించలేకపోతున్నారు. ఇక కొత్త సినిమాలు చేయడమంటే దాదాపు కష్టమే. పైగా ఉస్తాద్ భగత్ సింగ్ కొంత షూటింగ్ జరిగాక, బ్రేక్ పడింది. ఇక సురేందర్ రెడ్డితో ఒక సినిమా కమిట్ కాగా, ఇప్పుడు దాని ఊసే లేకుండా పోయింది. దీంతో పవన్ నిజంగానే సినిమాలు కంటిన్యూ చేస్తారా? అసలు ఆయనకి అంత సమయం దొరుకుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే సినిమాలు చేయాలనుకుంటే మాత్రం.. హరి హర వీరమల్లు, ఓజీ వంటి భారీ ప్రాజెక్ట్ ల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలైతే తక్కువ రోజుల్లో పూర్తి చేసే అవకాశముంటుంది. మరి పవన్ ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
