సిద్ధు 'జాక్'.. అసలు సౌండ్ లేదేంటి..?
on Apr 1, 2025
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్ సెన్సేషన్ గా మారిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). అలాంటి సిద్ధు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజం. కానీ సిద్ధు కొత్త చిత్రం 'జాక్' విషయంలో ఆ పరిస్థితి కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సిద్ధు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరో స్థాయికి ఎదిగాడు. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా' సినిమాలతో యువతకు చేరువయ్యాడు. ఇక 2022లో సిద్ధు హీరోగా నటించిన డీజే టిల్లు.. థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. సిద్ధుకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చేయగా.. అది కూడా సంచలన విజయం సాధించి, యూత్ లో సిద్ధు పేరు మారుమోగిపోయేలా చేసింది. ఈ రెండు సినిమాల తర్వాత మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ స్టార్ గా సిద్ధు పేరు పొందాడు. అలాంటి సిద్ధు నుంచి వస్తున్న కొత్త సినిమాపై అంతగా బజ్ లేకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' (Jack) అనే సినిమా చేస్తున్నాడు సిద్ధు. SVCC బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీ, ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా పది రోజులు కూడా లేదు. అయినా ఈ సినిమాపై ఎందుకనో రావాల్సినంత బజ్ రాలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ప్రతిభగల దర్శకుడే.. కానీ, ఆయన బ్రాండ్ ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. ఇక సిద్ధు విషయానికొస్తే.. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు రెండూ కామెడీ ప్రధానంగా తెరకెక్కాయి. కానీ, జాక్ లో కామెడీ కంటే యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ప్రచార చిత్రాలను బట్టి అర్థమవుతోంది. అలాగే టిల్లు సినిమాలకు మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాటలు పెద్ద హిట్ అయ్యాయి. జాక్ నుంచి అలాంటి చార్ట్ బస్టర్ సాంగ్ రాలేదు. ఇలా పలు కారణాల వల్ల జాక్ సినిమాకి రావాల్సినంత బజ్ రావడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి బజ్ తో సంబంధం లేకుండా సిద్ధు సైలెంట్ గా వచ్చి.. జాక్ తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
