మోక్షజ్ఞ, ప్రశాంత్‌వర్మ సినిమా ఆగిపోయిందా? క్లారిటీ వచ్చేసింది!
on Dec 19, 2024
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్న విషయం నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం. నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ రంగంలోకి దిగాలని ప్రతి నందమూరి అభిమాని కోరుకుంటాడు. ఎంతో కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు వస్తూనే ఉఉన్నాయి. తన కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని నందమూరి బాలకృష్ణ చెప్పిన రోజు నుంచే అభిమానుల్లో మోక్షజ్ఞ ఎంట్రీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే మోక్షజ్ఞ ఎంతో అద్భుతంగా మేకోవర్ అయ్యాడు. హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా నందమూరి అభిమానులు ఆ వార్త విని సంబరాలు చేసుకున్నారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
మోక్షజ్ఞ హీరోగా వచ్చే మొదటి సినిమాను ప్రశాంత్ వర్మ వంటి టాలెంటెడ్ డైరెక్టర్ చేయడం నందమూరి అభిమానులకు ఎంతో థ్రిల్ కలిగించే అంశంగా మారింది. అదే సమయంలో మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో సినిమా అనే ఎనౌన్స్‌మెంట్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోకుండానే మోక్షజ్ఞ మొదటి సినిమా ఆగిపోయిందనే వార్త స్ప్రెడ్ అయింది. దీనికి కారణం మోక్షజ్ఞ సినిమాను పక్కన పెట్టి మరో సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో ప్రశాంత్ వర్మ బిజీ అయిపోయాడని, అందుకే మోక్షజ్ఞ సినిమా గురించి పట్టించుకోవడం మానేశాడనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. అంతేకాదు, ఈ విషయంలో బాలయ్యబాబు కూడా చాలా సీరియస్ అయ్యాడని చెప్పుకున్నారు. ఈ వార్తలన్నీ నందమూరి అభిమానుల్ని బాగా హర్ట్ చేశాయి. ప్రశాంత్ వర్మపై కొందరు అభిమానులు కామెంట్ కూడా చేశారు. తమ అభిమాన యంగ్ హీరో మొదటి సినిమాకే ఇన్ని ఆటంకాలు రావడం నందమూరి అభిమానులు తట్టుకోలేకపోయారు. అయితే ఈ కాంబినేషన్‌లో సినిమా లేదు అనీ, ఆగిపోయిందని రకరకాల వార్తలు చక్కర్లు కొట్టినా ఈ విషయంపై నందమూరి ఫ్యామిలీ నుంచిగానీ, ప్రశాంత్ వర్మ నుంచి గానీ ఎలాంటి అప్‌డేట్ లేదు.
సినిమా ప్రారంభం కాకుండానే రకరకాల ఊహాగానాలు బాగా ప్రచారంలోకి రావడంతో మోక్షజ్ఞ మొదటి సినిమాను నిర్మిస్తున్న ఎస్.ఎల్.వి. సినిమాస్ అధినేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నమ్మొద్దని, అలాంటిది ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మేమే తెలియజేస్తామని, ఏదైనా అధికారికంగా మేం ప్రకటించిన తర్వాత నిర్దారణ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాదు, అసత్య ప్రచారాన్ని ప్రోత్సహించవద్దని కోరారు.