ట్రైలర్ రివ్యూ : ‘ఐ యామ్ అన్‌ప్రెడిక్టబుల్’.. ఎవరూ ఊహించని షాక్ ఇవ్వనున్న ‘గేమ్ ఛేంజర్’!
on Jan 2, 2025
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. రాజమండ్రిలో జనవరి 4న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరగబోతోంది. ఇదిలా ఉంటే జనవరి 2న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఎఎంబి సినిమాస్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
డైరెక్టర్ శంకర్ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని అద్ది ఘన విజయాల్ని అందుకోవడం మనం చూస్తున్నాం. ‘గేమ్ ఛేంజర్’ కూడా అలాంటి సినిమాయే అని టీజర్‌లో అర్థమవుతుంది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ దాన్ని కన్‌ఫర్మ్ చేసింది. రామ్‌చరణ్ రెండు పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌లో గతాన్ని, వర్తమానాన్ని మిక్స్ చేసి చూపించారు. ‘కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగుకు ఒక ముద్ద వదిలిపెడితే.. పెద్దగా దానికొచ్చే నష్టమేం లేదు. కానీ, అది లక్ష చీమలకు ఆహారం..’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ఒక్క డైలాగుతో సినిమా ఎలా ఉండబోతోందనేది రివీల్ అయింది. ‘నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. నేను చనిపోయేవరకు ఐఎఎస్’ అని ఎస్.జె.సూర్యతో చరణ్ చెప్పే డైలాగ్ థియేటర్‌లో విజిల్స్ వేయిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
శంకర్ సినిమా అంటేనే భారీ తనానికి పెట్టింది పేరు. తన ప్రతి సినిమాలో ఆ రిచ్‌నెస్ ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకుంటారన్న విషయం తెలిసిందే. దానికి స్టోరీ సహకరించకపోయినా.. పాటల్లో అయినా ఆ భారీతనం చూపిస్తారు. ఈ సినిమాలో కూడా పాటలన్నింటినీ డిఫరెంట్‌గా చాలా రిచ్‌గా
పిక్చరైజ్ చేశారని అర్థమవుతుంది. ఇందులో చరణ్ రెండు పాత్రలు పోషించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మూడో షేడ్ కూడా ఉంటుందనే విషయం కూడా బాగా వైరల్ అయింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇందులో చరణ్ మూడు విభిన్నమైన గెటప్‌లలో కనిపించారు. మరి ఆ మూడో క్యారెక్టర్ ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. సొసైటీలో పేద వారికి జరుగుతున్న అన్యాయాలతోపాటు రాజకీయాలను కూడా ప్రధానంగా ఈ సినిమాలో చూపించారు. సినిమాటోగ్రఫీగానీ, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గానీ ఆకట్టుకునేలా ఉన్నాయి. శంకర్ తెలుగులో తొలిసారి చేస్తున్న సినిమా.. చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి సినిమా.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో ఉంది. అయితే ‘ఐ యామ్ అన్‌ప్రెడిక్టబుల్..’ అంటూ ట్రైలర్ చివరలో చరణ్ చెప్పిన డైలాగ్‌లాగే సినిమా కూడా ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఆ మ్యాజిక్ ఏమిటో తెలుసుకోవాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే.
Also Read