ENGLISH | TELUGU  

'దసరా' మూవీ రివ్యూ

on Mar 30, 2023

 

సినిమా పేరు: దసరా
తారాగణం: నాని, కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, సాయికుమార్, సముద్రకని, ఝాన్సీ
డైలాగ్స్: తోట శ్రీనివాస్
పాటలు: కాసర్ల శ్యామ్, శ్రీమణి, రెహమాన్, గడ్డం సురేశ్
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాశ్ కొల్లా
స్టంట్స్: రియల్ సతీశ్, అన్బరివ్
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, ఈశ్వర్ పెంటి
సౌండ్ డిజైన్: సురేన్ జి., ఎస్. అలగియకూత్తన్  
నిర్మాత: సుధాకర్ చెరుకూరి 
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
రిలీజ్ డేట్: 30 మార్చి 2023

'దసరా' ట్రైలర్‌లో నాని అవతారాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంతదాకా లోకల్ బాయ్‌గా, మన పక్కింటి అబ్బాయిగా కనిపిస్తూ వచ్చిన అతను మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్‌ను, అందులోనూ ఒక మొరటోడి క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడని అర్థమైంది. అంతకు ముందు వచ్చిన టీజర్, సాంగ్స్‌తో వచ్చిన క్రేజ్, ట్రైలర్ తర్వాత ఇంకో లెవల్‌కు చేరుకుంది. దానికి తగ్గట్లే నాని కెరీర్‌లో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని అడ్వాన్స్ బుకింగ్స్ మొదటిరోజు 'దసరా'కు కనిపించింది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తీసిన 'దసరా' ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది.

కథ
సింగరేణి కాలరీస్ దగ్గర్లోని వీర్లపాలెం అనే ఊళ్లో ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి).. ఒకరి కోసం ఒకరు ప్రాణమైనా సునాయాసంగా ఇచ్చేంత జిగరీ దోస్తులు. ఇద్దరికీ తమ చిన్ననాటి నేస్తం వెన్నెల (కీర్తి సురేశ్) అంటే ప్రేమ. చిన్నప్పుడే వెన్నెలను తను ప్రేమిస్తున్నానని సూరి చెబితే, తన ప్రేమను తన గుండెల్లోనే దాచుకొని, సూరి-వెన్నెలను ఒక్కటి చేస్తాడు ధరణి. వీర్లపాలెంలో 'సిల్క్ బార్' బాగా ఫేమస్. ఎన్టీ రామారావు మద్య నిషేధం తేవడంతో తాగుడుకు అలవాటుపడ్డ ఆ ఊరి మగోళ్లంతా డీలా పడతారు. తాగుబోతులైన ధరణి, సూరి కూడా. అయితే సర్పంచి పోటీలో సవతి సోదరుడు రాజన్న (సాయికుమార్)పై గెలిచిన శివన్న (సముద్రకని), సిల్క్ బార్‌ను మళ్లీ తెరుస్తాడు. సరైన ఉద్యోగం లేని సూరికి తన కూతుర్ని ఇవ్వనని వెన్నెల తల్లి చెప్పడంతో, క్రికెట్ ఆటలో గెలిచి, సూరికి సిల్క్ బార్ క్యాషియర్ ఉద్యోగం వచ్చేట్లు చేస్తాడు ధరణి. అయితే పెళ్లయిన రోజు రాత్రి ఎక్కడినుంచో వచ్చిన గూండాలు బార్ దగ్గర దావత్ చేసుకుంటున్న ధరణి మిత్ర బృందంపై దాడిచేస్తారు. సూరి తల నరికేసి, మరో ముగ్గుర్ని కూడా చంపేస్తారు. తొలి రేయి కాకుండానే వితంతువు అవుతుంది వెన్నెల. తన ప్రాణమైన వెన్నెలను అలా చూసి భరించలేకపోయిన ధరణి ఏం చేశాడు? సూరిని చంపిన హంతకులెవరు? వారిపై ధరణి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే విషయాలను మిగతా కథలో చూస్తాం. 

విశ్లేషణ
'దసరా'లో నిజంగానే మనం ఎప్పుడూ చూడని ఒక మొరటు తాగుబోతు పాత్రలో నానిని చూస్తాం. ఇంతదాకా నానికి ఉన్న ఇమేజ్‌కు భిన్నమైన క్యారెక్టర్‌లో బొగ్గు మరకలతో నిండిన మొహంతో ఉండే అతడ్ని చూపిస్తూ ఈ సినిమా తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సాహసాన్ని అభినందించి తీరాలి. అలాగే ఇలాంటి పాత్రను చేస్తే, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం లేకుండా ఆ పాత్రను పోషించిన నానిని మెచ్చుకోవాలి. ఈ సినిమా కథ మొత్తం ఒక పాత్ర కేంద్రకంగా నడుస్తుంది. ఆ పాత్ర.. వెన్నెల. ఆ వెన్నెల చుట్టూ మూడు పాత్రల్ని నడిపించాడు కథకుడు కూడా అయిన దర్శకుడు శ్రీకాంత్. ఆ మూడు పాత్రలు.. ధరణి, సూరి, చిననంబయ్య. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు మద్యం కూడా వారి జీవితంలో భాగమంటూ చూపించిన కథకుడు, ఆ మందు వల్ల ఆడవాళ్ల జీవితాలు ఎలా దుర్భరమవుతున్నాయో చివరలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే కథలో సిల్క్ బార్ కూడా ఒక కీలక పాత్ర పోషించింది. సిల్క్ స్మిత బొమ్మతో కనిపించే ఆ బార్‌లో మందు తాగే తాగుబోతులకు మత్తునిచ్చేది మందు మాత్రమే కాదు, అందులోని టీవీలో వచ్చే స్మిత పాటలు కూడా. అంటే.. ఇది సమకాలీన కథ కాదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన మద్యనిషేధం తెచ్చిన నాటి కథ. జనం సిల్క్ స్మితను విపరీతంగా ఆరాధించినప్పటి కాలం కథ.

ధరణి, సూరి మధ్య స్నేహం చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. సూరి కోసం వెన్నెల మీద తన ప్రేమను ధరణి అణచివేసుకోవడం ఆ పాత్రపై సానుభూతి కలిగేట్లు చేస్తుంది. ధరణిని కాకుండా సూరిని వెన్నెల ఇష్టపడటం, ఆ ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ధరణి పాత్రపై జాలి కలిగేట్లు చేస్తాయి. నాని ఏంటి ఇలాంటి క్యారెక్టర్ చేశాడు అనే అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది. సినిమాలో కీర్తి సురేశ్.. నానిని కాకుండా ఎవరో ఒక అనామక నటుడ్ని ఇష్టపడటం ఎవరికి మాత్రం ఇష్టముంటుంది? అయినా ఏ మూలో ఆ ఇద్దరూ కలుస్తారనే ఆశ మిణుకు మిణుకుమంటూ ఉంటే, వెన్నెల, సూరికి దగ్గరుండి ధరణి చేత పెళ్లి జరిపించేసి, ఆ ఆశలపై నీళ్లు కుమ్మరించేశాడు దర్శకుడు. అప్పుడే సూరికి కూడా వెన్నెలను ధరణి ఇష్టపడుతున్నాడనే విషయం తెలిసిపోతుంది. కానీ ఇద్దరూ ఏమీ ఎరగనట్లుగానే ఉంటారు. అంతలోనే సూరి తల తెగిపడి, వెన్నెల బతుకు బుగ్గిపాలయ్యే ఘట్టం వస్తుంది. కానీ వెన్నెల బతుకు అలా అయిపోతుంటే, ధరణి ఎలా తట్టుకుంటాడు! అందుకే ఊరంతా షాకయ్యే పని చేస్తాడు. ఒక కులం తక్కువోడు ఆ పని చేస్తే వెన్నెల కులపోళ్లు ఊరుకుంటారా? లొల్లి చెయ్యబోతారు. కానీ ధరణి-సూరి కారణంగా సర్పంచి అయిన రాజన్న అతడికి మద్దతుగా నిలుస్తాడు. వెన్నెల తల్లితండ్రులు కూడా తమ కూతురి కోసం ధరణి చేసిన పనికి హర్షిస్తారు. ఈ సన్నివేశాన్ని శ్రీకాంత్ ఓదెల చాలా బాగా తీశాడు. వెన్నెలపై కన్నేసిన తూర్పుగుట్ట చిననంబయ్య (షైన్ టామ్ చాకో) చేసే దుర్మార్గం, మందు తాగితే తప్ప ధైర్యం తెచ్చుకోలేని పిరికివాడైన ధరణి అతడిని ఎదుర్కొనే విధానాన్ని దర్శకుడు ఇంకా ప్రభావవంతంగా చిత్రీకరిస్తే బాగుండేదనిపిస్తుంది. నాని, కీర్తి మధ్య రొమాంటిక్ యాంగిల్ లేకపోయడంతో దాన్ని ఎక్స్‌పెక్ట్ చేసినవాళ్లంతా అసంతృప్తికి లోనవుతారు. ఈ తరహా కథలు గతంలోనూ వచ్చాయి. కొత్తదనం ఏదైనా ఉందంటే.. అది ధరణి క్యారెక్టర్‌ను నాని చేయడమే.

తోట శ్రీనివాస్ డైలాగ్స్ సమయోచితంగా, సందర్భోచితంగా సాగాయి. సంతోష్ నారాయణన్ స్వరాలు కూర్చిన పాటలు బాగానే ఉన్నాయి. 'ధూమ్ ధామ్ దోస్తాన్' సాంగ్ ధూం ధాంగానే ఉంది. 'చమ్కీల అంగీలేసి' పాట ఊహించిన స్థాయిలో లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవల్లో ఉంది. సత్యన్ సూర్యన్ కెమెరా వర్క్ సూపర్బ్. కలర్ టోన్ కానీ, సీన్స్ పిక్చరైజేషన్ కానీ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. ఎడిటర్ నవీన్ నూలి శక్తివంచన లేకుండా సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా కనిపించడానికి కష్టపడ్డాడు. కొల్లా అవినాశ్ ఆర్ట్ వర్క్ ఇంప్రెసివ్‌గా ఉంది. రియల్ సతీశ్, అన్బరివ్ డిజైన్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఫైట్ ఓకే. సూరిని చంపేప్పుడు వచ్చే సీన్లు 'రంగస్థలం' సీన్లను గుర్తుకు తెచ్చాయి.

నటీనటుల పనితీరు
ధరణి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, దాన్ని ఉన్నత స్థాయిలో పోషించాడు నాని. ఆ క్యారెక్టర్‌లోని మానసిక సంఘర్షణను అతను చేసిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. ఇంత రగ్డ్ క్యారెక్టర్ నానికి సూటవుతుందా అని అతని విమర్శకులు సైతం ఆశ్చర్యపోయే రీతిలో దాన్ని చేశాడు. అతని మేనరిజమ్స్ అలరిస్తాయి. ఈ సినిమా చూశాక నాని విషయంలో కథకుల, దర్శకుల దృక్పథం మారుతుంది. సూరి క్యారెక్టర్‌లో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి చాలా హుషారుగా చేశాడు. నానితో కలిసి ఉన్న సీన్లలో అతనికి ఏమాత్రం తగ్గని నటనను ప్రదర్శించాడు. కథకు కేంద్రబిందువు లాంటి వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ సునాయాసంగా ఇమిడిపోయింది. చాలా రోజుల తర్వాత ఆమెకు నటించడానికి అవకాశమున్న మంచి పాత్ర దొరికింది. విలన్ చిననంబయ్యగా మలయాళం నటుడు షైన్ టామ్ చాకో ఆకట్టుకున్నాడు. అతని భార్య పాత్రలో పూర్ణ నిండుగా కనిపించింది. రాజన్న, శివన్న పాత్రల్లో సాయికుమార్, సముద్రకని రాణించారు. మిగతా పాత్రధారులు తమ పరిధుల మేరకు చేశారు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్
ఇంతదాకా తను పోషించని ఒక పూర్తిస్థాయి మాస్ రోల్‌లో నాని చెలరేగిన 'దసరా' సినిమా యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుంది. అతడిని ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కు దగ్గర చేస్తుంది. నాని అంటే ఇష్టపడే ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం అతడిని ఇలాంటి తాగుబోతు పాత్రలో, హింసాత్మక పాత్రలో చూడ్డానికి ఇష్టపడకపోయే అవకాశం ఉంది. అయితే నాని ప్రదర్శించిన అభినయం కోసమైనా ఈ సినిమాని చూడొచ్చు. 

రేటింగ్: 3/5

- బుద్ధి యజ్ఞమూర్తి 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.