‘చెడ్డవాళ్ళకు అతను డాకు.. నాకు మాత్రం మహారాజు’ అదరగొడుతున్న ట్రైలర్!
on Jan 4, 2025
ఇటీవల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకున్న నందమూరి బాలకృష్ణ.. ఇప్పటి ప్రేక్షకులకు అనుగుణంగా, ప్రజెంట్ ట్రెండ్‌ని ఫాలో అవుతూ సినిమాలు చేయడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు బాలయ్య కెరీర్‌లో చెయ్యని ఓ డిఫరెంట్ మూవీ ‘డాకు మహారాజ్’ అనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఎప్పటి నుంచో బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్న ట్రైలర్ రానే వచ్చేసింది. నిమిష నిమషానికీ వ్యూస్ వేలల్లో పెరుగుతూ వెళుతోంది. ఆడియన్స్ అంత ఈగర్‌గా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ బాబీ టేకింగ్ అద్భుతంగా ఉంది. బాలయ్యను ఎలా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులు, అభిమానులు థ్రిల్ అవుతారో ఆ విధంగా ప్రతి షాట్‌నీ తీసినట్టుగా అనిపించింది.
ఓ చిన్న పాప వాయిస్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ‘అనగనగా ఒక రాజుండేవాడు. చెడ్డవాళ్లంతా ఆయన్ని డాకు అనేవారు.. నాకు మాత్రం మహారాజు’ ఈ డైలాగ్‌తో డాకు మహారాజ్ క్యారెక్టర్ ఏమిటి అనేది అర్థమవుతుంది. సినిమాలో ఎన్నో మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నాయని ట్రైలర్‌లోని విజువల్స్ చెబుతున్నాయి. భారీ యాక్షన్ సీన్స్‌తోపాటు ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా ‘కింగ్ ఆఫ్ జంగిల్’ అంటూ పాప చెప్పే మాట బాలయ్య క్యారెక్టర్‌ను మరింత ఎలివేట్ చేసేలా ఉంది. ఇంతకు ముందు గ్లామర్ హీరోయిన్‌గా కనిపించిన ప్రగ్యా జైస్వాల్‌కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఆమెతో యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చేయించినట్టు అర్థమవుతోంది. ఇక ఊర్వశీ రౌతెలాను గ్లామర్ కోసమే తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే శ్రద్ధా శ్రీనాథ్‌కి కూడా సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా ఉంది. అన్నింటినీ మించి బాలయ్యతో ఢీ అంటే ఢీ అనే క్రూరమైన విలన్ క్యారెక్టర్‌లో బాబీ డియోల్ అదరగొట్టినట్టుగా కనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఓ నలభై నిమిషాల పాటు కనిపించే ఈ డాకు ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ అని అర్థం అవుతోంది.
ఏ విధంగా చూసినా బాలకృష్ణకు ఇది కొత్త తరహా సినిమా అని నిస్సందేహంగా చెప్పొచ్చు. డైరెక్టర్ బాబీ.. బాలకృష్ణను ఎలివేట్ చేసిన సీన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తోంది. దానికి తోడు తమన్ మ్యూజిక్ కూడా మంచి సౌండిరగ్‌తో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌పై ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘జై బాలయ్య..’, ‘దబిడి దిబిడే..’, ‘సంక్రాంతికి దిమ్మ తిరిగిపోవాలి..’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జనవరి 12న థియేటర్లలో సందడి చేయబోతున్న ‘డాకు మహారాజ్’కి ట్రైలర్‌తో మరింత క్రేజ్ పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కోసం బాలయ్య డల్లాస్‌లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడి అభిమానులతో బాలయ్య సందడి చేస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ బాలయ్య అభిమానులకు నిజమైన పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయబోతోంది.