బాలయ్య 'అఖండ-2'కి పోటీగా చిరు 'విశ్వంభర'..!
on Mar 31, 2025
చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) బాక్సాఫీస్ వార్ కి తెలుగునాట ఎప్పుడూ ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే వీళ్ళిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పలుసార్లు తలపడగా.. కొన్నిసార్లు చిరు, మరికొన్ని సార్లు బాలయ్య పైచేయి సాధించారు. చివరగా వీరిద్దరూ 2023 సంక్రాంతికి తలపడ్డారు. ఆ పోరులో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ గా నిలవగా, బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' హిట్ తో సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ అగ్ర హీరోలు మరోసారి బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ 'అఖండ-2' (Akhanda 2). బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'అఖండ' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న సినిమా కావడంతో 'అఖండ-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఇదే తేదీపై చిరంజీవి సినిమా కన్ను పడినట్లు సమాచారం.
చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' (Vishwambhara) అనే సోషియో ఫాంటసీ ఫిల్మ్ చేస్తున్నారు. వేసవికి విడుదల కావాల్సిన ఈ చిత్రం.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వాయిదా పడింది. జులై లేదా ఆగస్టులో విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ని హడావుడిగా చుట్టేయకుండా, మరింత సమయం తీసుకొని.. అదిరిపోయే అవుట్ పుట్ ఇవ్వాలని మేకర్స్ చూస్తున్నారట. అందుకే దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అదే జరిగితే చిరంజీవి, బాలకృష్ణ మధ్య మరోసారి బాక్సాఫీస్ వార్ చూడనున్నాం. మరి ఈ ఫైట్ లో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
