అల్లు అర్జున్‌కి పబ్లిసిటీ కంటే... ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ముఖ్యం!
on Dec 16, 2024
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అంతకుముందు రోజు ప్రీమియర్స్ వేసిన సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషాద ఘటన అందర్నీ కలచి వేసింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి గత 13 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై పుష్ప2 యూనిట్ విచారాన్ని వ్యక్తం చేసింది. మృతి చెందిన రేవతి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేసింది. అంతేకాదు, తమ సినిమా వల్ల నష్టపోయిన కుటుంబానికి తనవంతు సాయంగా అల్లు అర్జున్ రూ.25లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఘటన జరిగి 13 రోజులు గడిచినా ఇప్పటివరకు అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదని, కనీసం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ని కూడా చూసేందుకు వెళ్ళలేదనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఈ విషయం గురించి కొన్ని మీడియా సంస్థలు పదే పదే ప్రస్తావించడం వెనుక అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కావాలనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అల్లు అర్జున్... వారిని పరామర్శించేందుకు వెళ్లకపోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తాను థియేటర్‌కి వెళ్ళడం వల్ల ఈ అనర్థం జరిగిందని, ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్లినా, ఆ చిన్నారిని పలకరించేందుకు వెళ్లినా అక్కడ మళ్ళీ ఫ్యాన్స్ కోలాహలం ఎక్కువ అవుతుందని, ఇంతకుముందు జరిగిన దుర్ఘటన వంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదనే వారిని కలవలేదని తెలుస్తోంది. వారిని కలవడం కంటే వారిని ఆదుకోవడం తనకు ముఖ్యమని బన్నీ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తను ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబానికి, ఆ బాలుడికి తనవంతు సాయం చేస్తున్నారు. అతని వైద్యం నిమిత్తం ఇప్పటివరకు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. ఆ మొత్తాన్ని తనే భరించారు. శ్రీతేజ్‌కి మెరుగైన వైద్యం అందించేందుకు సింగపూర్ నుంచి కూడా ఖరీదైన ఓ ఇంజెక్షన్ తెప్పించిన విషయం తెలిసిందే.
రేవతి కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని, అయినా అల్లు అర్జున్ తనవంతు సాయం చేస్తున్నారని బన్నీ అభిమానులు చెబుతున్నారు. ఇదంతా చేస్తోంది పబ్లిసిటీ కోసం కాదని, ఒక బాధ్యతగా ఫీల్ అయి చేస్తున్నారని అంటున్నారు. పబ్లిసిటీ కోసమే అయితే ఇప్పటికే ఆ బాలుడితో లేదా ఆ కుటుంబంతో ఓ ఫోటో దిగి మీడియాకి ఇచ్చి ఉండేవారు. కానీ, అలా చేయలేదు. నిజానికి అల్లు అర్జున్ పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదు. అందుకే సైలెంట్‌గా తను చేయాల్సిన సాయం చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంగా తను పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటానని బాలుడి తండ్రి భాస్కర్ మీడియా ముఖంగా చెప్పినపుడే వారికి బన్నీ ఎంత సిన్సియర్‌గా సాయం చేస్తున్నారనే విషయం అర్థమవుతోందని అంటున్నారు.
ఇక అల్లు అర్జున్ జైలులో కొన్ని గంటలు గడిపి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్ళి పలకరించి వచ్చారు. దీనిపై కూడా ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్ళలేదు, చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ని చూసేందుకు కూడా వెళ్ళలేదు. కానీ, అల్లు అర్జున్ జైలు నుంచి రాగానే ప్రముఖులంతా క్యూ కట్టారు అంటూ రకరకాల విమర్శలు మీడియాలో వినిపించాయి. దీనిపై కూడా అభిమానులు స్పందిస్తున్నారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులు అల్లు అర్జున్‌పై ఉన్న జాలితో వారు కలవలేదు అంటున్నారు. అతని క్యారెక్టర్‌పై వారందరికీ ఉన్న గౌరవం, ఆయన ఆలోచన, ఆచరణపై ఉన్న నమ్మకంతోనే కలిశారని చెబుతున్నారు. అంతేకాదు, అల్లు అర్జున్ తత్వాన్ని నమ్మి తామంతా మీకు అండగా ఉన్నామని సంఫీుభావం తెలిపేందుకే వెళ్లి కలిశారు తప్ప మరో ఉద్దేశంతో కాదని బన్నీ అభిమానులు స్పష్టం చేస్తున్నారు.