గోల్డ్ స్మగ్లింగ్‌లో రన్యారావుకి ట్రైనింగ్ ఎవరిచ్చారో తెలిస్తే షాక్ అవుతారు!
on Mar 13, 2025
మార్చి 4, దుబాయ్ నుంచి వచ్చిన విమానం బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయింది. భర్త జతిన్ హుక్కేరితో కలిసి ఫ్లైట్ దిగిన రన్యారావుపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను చెక్ చేయగా తనతోపాటు 14.8 కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తించారు పోలీసులు. వెంటనే ఆమెను అరెస్ట్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ ప్రిజన్‌లో ఉన్న రన్యా చెప్పిన కొన్ని విషయాలు విని పోలీసులు షాక్ అవుతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ చెయ్యాలంటే ఎంతో అనుభవం ఉండాలి. అంత అనుభవం ఆమెకు ఎలా వచ్చింది అనే విషయాలను తెలియజేసింది. అంతేకాదు, తన జీవితంలో అదే తొలి స్మగ్లింగ్ అని కూడా చెప్పింది.
దుబాయ్ నుంచి మార్చి 4న బయల్దేరాల్సి ఉండగా అదేరోజు రన్యాకు ఒక ఇంటర్నెట్ కాల్ వచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ గేట్ 3కి వెళ్లాలని అవతలి వ్యక్తి చెప్పాడు. అతను చెప్పినట్టుగానే అక్కడికి వెళ్లింది. ఓ వ్యక్తి ఆమెకు 2 పార్సిల్స్ ఇచ్చాడు. అందులో బంగారు బిస్కెట్లు ఉన్నాయని రన్యా తెలుసుకుంది. అయితే తనకు బంగారం అందుతుందని, దాన్ని ఇండియాకు చేర్చాలన్న విషయం రన్యాకు ముందే తెలుసు. అందుకే ఆ బంగారాన్ని సేఫ్‌గా ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచించింది. దాని కోసం యూట్యూబ్‌ను సెర్చ్ చేసింది. అందులో ఒక వీడియో ఆమెను ఆకర్షించింది. ఆ వీడియోను ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. ఈ విషయంలో రన్యాకు ట్రైనింగ్ ఇచ్చిన గురువు యూ ట్యూబ్.
పార్సిల్స్ తీసుకున్న వెంటనే దాన్ని తీసుకెళ్లేందుకు కావాల్సిన సామాగ్రిని ఎయిర్‌పోర్ట్ బయట కొనుగోలు చేసింది. ప్లాస్టర్ కొని దాన్ని ముక్కలు చేసి బ్యాగ్‌లో పెట్టుకుంది. బాత్రూమ్‌లోకి వెళ్లి ప్లాస్టర్ సాయంతో బంగారు బిస్కెట్లను నడుము చుట్టూ అమర్చింది. అవి పైకి కనిపించకుండా వుండేలా డ్రెస్‌ని ముందుగానే సెట్ చేసుకుంది. బెంగళూరులో ఫ్లయిట్ దిగగానే వీఐపీ ప్రోటోకాల్‌లో భాగంగా సెక్యూరిటీ చెక్ లేకుండానే బయటికి వెళ్లింది. ఎయిర్‌పోర్ట్ నుంచి కొన్ని అడుగులు బయటికి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు రన్యాను అదుపులోకి తీసుకున్నారు. తనతో తెచ్చిన బంగారాన్ని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తనకి అదే మొదటి స్మగ్లింగ్ అని చెప్పిన రన్యా ఈ ఆరు నెలల్లో 27 సార్లు దుబాయ్ వెళ్లింది. చివరగా 15 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు వెళ్లింది. ఇదంతా చూస్తుంటే ఎంతో కాలంగా దుబాయ్ నుంచి ఇండియాకు బంగారాన్ని చేరవేస్తోందనే అనుమానం పోలీసులకు వచ్చింది. ఆ దిశగా తమ విచారణను కొనసాగిస్తున్నారు పోలీసులు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
