కేవలం రెండేళ్ళలో రూ.3,300 కోట్లు.. ఇది రష్మికకు మాత్రమే సాధ్యమైంది!
on Mar 13, 2025
ఏ సినిమాకైనా హీరో ఎంత ముఖ్యమో.. హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. సినిమాకి కథాబలం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో హీరో, హీరోయిన్ వల్ల సినిమాలు భారీ విజయాల్ని అందుకుంటాయి. హీరోల విషయం ఎలా ఉన్నా.. కొందరు హీరోయిన్ల విషయంలో సినిమాల జయాపజయాలపై రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి. ఒక హీరోయిన్ నటించిన సినిమాలు వరసగా హిట్ అయితే ఆమెది గోల్డెన్ లెగ్ అనీ, ఫ్లాప్ అయితే ముందూ వెనకా చూడకుండా ఆ హీరోయిన్‌ది ఐరన్ లెగ్ అనీ ముద్ర వేసేస్తుంటారు. కానీ, ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న దానికి భిన్నంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాల్లో హీరోయిన్‌గా నటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
2023లో విడుదలైన ‘యానిమల్’, గత ఏడాది విడుదలైన అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప2’ కలెక్షన్ల పరంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. తాజాగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘ఛావా’ చిత్రంలో కూడా రష్మిక కీలక పాత్రలో కనిపించింది. మొదట హిందీలో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇటీవల తెలుగులో కూడా ‘ఛావా’ విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ మూడు సినిమాల కలెక్షన్స్ రూ.3,300 కోట్లకి చేరుకున్నాయి. కేవలం హిందీలోనే ఈ మూడు సినిమాలు రూ.1850 కోట్లు కలెక్ట్ చేయడం ఒక రికార్డ్. ఇప్పటివరకు ఏ హీరోయిన్‌కీ సాధ్యం కాని ఈ రికార్డును రష్మిక సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. దీంతో ఆమెకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. రష్మిక ఉంటే తమ సినిమాకు కూడా బాగా ప్లస్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.
రష్మిక హీరోయిన్‌గా నటించిన హిందీ సినిమా ‘సికందర్’, ‘కుబేర’ చిత్రాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ ‘సికందర్’ చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నాడియాడ్‌వాలా రూ.200 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28న విడుదల కాబోతోంది. అలాగే నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘కుబేర’ చిత్రం జూన్ 20న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘కుబేర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టీ ఈ రెండు సినిమాలపైనే ఉంది. ఇప్పటికే రష్మిక నటించిన మూడు సినిమాలు కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన నేపథ్యంలో ‘సికందర్’, ‘కుబేర’ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో, వసూళ్ళలో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాయో చూడాలి. ఇవికాక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో దీక్షిత్ శెట్టికి జంటగా నటిస్తోంది రష్మిక. అలాగే ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ‘తమా’ చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కాబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
