వర్మ దర్శకత్వంలో వెంకటేష్ పాన్ ఇండియా మూవీ..!
on Jan 25, 2025
1989 లో విడుదలైన 'శివ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. మొదటి సినిమాతోనే ఎంతటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. ఆ తర్వాత దర్శకుడిగా తెలుగు, హిందీ భాషల్లో పలు గొప్ప సినిమాలను అందించాడు. అలాంటి వర్మ చాలా ఏళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమా తీయట్లేదు. ముఖ్యంగా గత పదేళ్లలో ఒక వర్గానికి లబ్ది చేకూర్చే సినిమాలనో లేదా తన పేరుని పూర్తిగా చెడగొట్టే సినిమాలలో చేశాడు. దర్శకుడిగా తాను దారి తప్పానని చాలా ఆలస్యంగా గ్రహించిన ఆర్జీవీ, ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. 'సత్య' తర్వాత కళ్ళు నెత్తికెక్కి తన స్థాయికి తగ్గ సినిమాలు చేయలేదని, ఇక నుంచి మంచి సినిమాలు చేస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వడానికి వర్మ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రామ్ గోపాల్ వర్మ తన కమ్ బ్యాక్ ఫిల్మ్ ని విక్టరీ వెంకటేష్ (Venkatesh)తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు వెంకటేష్. అదే జోష్ ని కంటిన్యూ చేసేలా, వెంకీ మామకి మరో బ్లాక్ బస్టర్ ని ఇవ్వడానికి వర్మ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే వెంకటేష్, ఆర్జీవీ మధ్య కథా చర్చలు జరిగాయని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు. అంతేకాదు ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనుందట. ఇందులో కీలక పాత్రల కోసం అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులను రంగంలోకి దింపుతున్నట్లు వినికిడి. కాగా, వెంకటేష్-ఆర్జీవీ కాంబినేషన్ లో గతంలో 'క్షణక్షణం' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
