తారక్‌తో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ భారీ పాన్ ఇండియా మూవీ!
on Mar 26, 2023
బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ దృష్టి తెలుగు హీరోలపై పడింది. ఇప్పటికే ప్రభాస్ తో 'ఆదిపురుష్'ని రూపొందిస్తున్న ఈ సంస్థ.. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాతి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్ ల తర్వాత తారక్ చేయబోయే సినిమా గురించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ కోసం ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దర్శకుడు, ఇతర విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం.