ఎన్టీఆర్కి తల్లిగా శ్రియ?
on Jul 20, 2021
సరిగ్గా పదహారేళ్ళ క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా కనువిందు చేసింది అందాల తార శ్రియ. 2005 సంక్రాంతికి సందడి చేసిన ఆ సినిమానే.. `నా అల్లుడు`. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆ చిత్రం తరువాత.. మళ్ళీ ఈ ఇద్దరు కలిసి నటించిన సందర్భం లేదు.
కట్ చేస్తే.. త్వరలో తారక్ కి తల్లిగా శ్రియ కనిపించబోతోందట. ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` పేరుతో ఓ పిరియడ్ డ్రామా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చరిత్ర పురుషులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్నేహం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అల్లూరిగా చరణ్, కొమురంగా తారక్ కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుండగా.. అతనికి జంటగా శ్రియ యాక్ట్ చేసింది. అజయ్ ఫ్లాష్ బ్యాక్ లో కొద్ది నిమిషాల పాటు శ్రియ తెరపై సందడి చేయనుంది. అంతేకాదు.. కొమురంకి తల్లి పాత్ర ఇదని సమాచారం. కాకపోతే, కొమురం (తారక్) చిన్నప్పుడే ఈ క్యారెక్టర్ చనిపోతుందట. అలా.. తారక్ కి ఒకప్పటి కథానాయిక అయిన శ్రియ ఇప్పుడు అతనికి తల్లి కాబోతోందన్నమాట. అయితే ఎటొచ్చి తారక్ కాంబినేషన్ లో శ్రియకి సన్నివేశాలేమీ ఉండవంతే.. కాగా, ఇటీవల `రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్` పేరిట విడుదల చేసిన మేకింగ్ వీడియోలో కొన్ని సెకండ్ల పాటు శ్రియ తళుక్కున మెరిసింది. గతంలో తను పోషించిన `మనం` తరహా కట్టుబొట్టుతోనే ఇందులోనూ కనిపిస్తోంది శ్రియ.
మరి.. `ఛత్రపతి` (2005) వంటి బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి సినిమాలో నటిస్తున్న శ్రియ.. పదహారేళ్ళ తరువాత మరో విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. దసరా కానుకగా అక్టోబర్ 13న `ఆర్ ఆర్ ఆర్` థియేటర్స్ లో సందడి చేయనుంది.