ప్రభాస్ మూవీలో సమంత.. 'ప్రాజక్ట్ K'కి మరింత గ్లామర్!!
on Jul 27, 2021
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'ప్రాజక్ట్ K' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ భామ దీపిక పదుకొణే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో ఒక ముఖ్య పాత్రలో సమంత నటించనుందని టాక్ వినిపిస్తోంది.
సమంతకు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నో ఏళ్ళుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న ఆమె.. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అలరిస్తోంది. విభిన్న పాత్రలు, చిత్రాలు ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటోంది. ఇక ఇటీవల 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులనూ పలకరించింది. ఇందులో సమంత తన నటనతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సమంత క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. 'ప్రాజక్ట్ K'లో ఓ ముఖ్య పాత్ర కోసం సమంతతో ఫిలిం మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సమంత నటిస్తే ఈ ప్రాజక్టుకి మరింత గ్లామర్ వస్తుందనే చెప్పచ్చు. సమంత కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపుతోందని సమాచారం.
సమంత ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న 'శాకుంతలం' చిత్రంలో నటిస్తోంది. ఇది కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.