వర్మ జైలుకెళ్లక తప్పదా..?
on Feb 24, 2018
ఎవరు ఏమైనా అనుకోని.. ఎంతైనా వాగని.. తన మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పడం.. ఎవరైనా వాదనకు వస్తే తల తిక్క సమాధానాలతో అవతలి వారి సహనాన్ని పరీక్షించే వర్మ... ఎన్నో కాంట్రవర్సీలను డీల్ చేసిన ట్రాక్ రికార్డు ఉన్న వర్మని ఓ చిన్న డాక్యుమెంటరీ చిక్కుల్లో పడేసింది. ఆయన తెరకెక్కించిన "గాడ్ సెక్స్ అండ్ ట్రూత్" వర్మను కటకటాల పాలు చేసేలా ఉంది. ఒక ఛానెల్ లైవ్ షోలో మహిళా సామాజిక కార్యకర్తను అసభ్యపదజాలంతో దూషించడంతో మొదలైన రచ్చ.. డొంకను కదిలించింది. జీఎస్టీ తరహా సినిమాలకు భారతదేశంలో అనుమతి లేదు. అందుకే తాను యూరప్‌లో సినిమాను తీసానని.. అక్కడే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశానని ఆర్జీవీ పోలీసులకు తెలిపాడు.
అయితే జీఎస్టీని వర్మ ఇండియాలోనే చిత్రీకరించాడని.. మియా మాల్కోవ భారత్‌కు వచ్చిన సమయంలో వారం రోజుల పాటు చిత్రీకరణ చేశాడని.. ఆ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ పూర్తిగా ఇండియాలోనే జరిగిందని.. అప్‌లోడ్ కూడా ఇక్కడి నుంచే అయ్యిందంటూ ఒక జాతీయ పత్రిక కథనం రాసింది. సీసీఎస్ దర్యాప్తులో కనుక వర్మ నేరం రుజువైతే ఐపీసీ ప్రకారం మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష తప్పదని..న్యాయ నిపుణులు అంటున్నారు. జరుగుతున్న పరిణామాలన్నింటిని చూస్తున్న ప్రేక్షకులు.. మహామహులకే చెమటలు పట్టించిన వర్మ ఇలా బుక్కయిపోయాడేంటీ.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.