ఇది సాధ్యమా? ఒకే సినిమాలో రజినీకాంత్, ధనుష్.. విశ్వప్రయత్నం చేస్తున్న డైరెక్టర్!
on Oct 22, 2024
సూపర్‌స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో 2010లో వచ్చిన ‘రోబో’ సెన్సేషనల్ హిట్ అయింది. అప్పటినుంచి 12 సంవత్సరాల్లో దాదాపు 10 సినిమాల్లో నటించారు రజినీ. కానీ, ఏ ఒక్కటీ బ్లాక్‌బస్టర్ అవ్వలేదు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వగా, కొన్ని సినిమాలు కలెక్షన్లపరంగా ఫర్వాలేదు అనిపించాయి. ఒకవిధంగా ఈ 12 ఏళ్ళలో రజినీకి చెప్పుకోదగ్గ హిట్ పడలేదన్నది వాస్తవం. దాని నుంచి సూపర్‌స్టార్‌ని బయటికి తీసుకొచ్చి మరో సెన్సేషనల్ హిట్ సినిమాను అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించి దాదాపు రూ.700 కోట్లు కలెక్ట్ చేసి తమిళ సినిమా చరిత్రలోనే కొత్త రికార్డును సృష్టించింది.
‘జైలర్’ తర్వాత రజినీ చేసిన ‘లాల్ సలామ్’ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’ పాజిటివ్ టాక్‌తో స్టార్ట్ అయి కలెక్షన్లపరంగా కూడా ఫర్వాలేదు అనిపించుకుంటోంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు రజినీ. ఆమధ్య అనారోగ్యానికి గురైన రజినీకి శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన త్వరలోనే ‘కూలీ’ సెట్స్ వెళ్ళనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘జైలర్’ తర్వాత సూపర్‌స్టార్ కెరీర్‌లో ‘కూలీ’ మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ నెల్సన్ ‘జైలర్2’ చిత్రానికి సంబంధించి వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ఈ సినిమాకి ఓ ప్రత్యేకతను జోడించాలని నెల్సన్ ప్రయత్నిస్తున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదేమిటంటే.. ‘జైలర్2’లో ధనుష్ నటించబోతున్నాడనేదే ఆ వార్త. 2004లో రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజినీకాంత్‌ని వివాహం చేసుకున్నారు. 18 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత పరస్పర అవగాహనతో ఇద్దరూ విడిపోయారు. ఇది జరిగిన తర్వాత రజినీ, ధనుష్ కలుసుకున్నది లేదు. ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో ధనుష్ నటించబోతున్నాడనే వార్త సంచలనంగా మారుతోంది.
‘జైలర్’ చిత్రంలో మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివరాజ్‌కుమార్ కేమియో రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌లో కూడా వారి పాత్రలు కొనసాగుతాయి. వారితోపాటు ధనుష్ కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ధనుష్ చేయబోయే క్యారెక్టర్ గురించి రజినీకి చెప్పడం, ఆయన అనుమతి తీసుకోవడం కూడా జరిగిపోయిందని సమాచారం. రజినీ, ధనుష్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అటు రజినీ ఫ్యాన్స్‌కి, ఇటు ధనుష్ ఫ్యాన్స్‌కి కూడా ఉంది. రజినీకాంత్‌కి ధనుష్ వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. రజినీతో కలిసి నటించేందుకు ధనుష్ కూడా ఓకే చెప్పే అవకాశం వుంది.
డైరెక్టర్ నెల్సన్ అంతటితో ఆగకుండా ‘జైలర్2’ ఓపెనింగ్‌కి ఐశ్వర్యారజినీకాంత్‌ని ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవంలో ధనుష్, ఐశ్వర్య మరోసారి కలుసుకునే అవకాశం ఉందని అభిమానులు ఆనందంగా చెబుతున్నారు. అయితే నెల్సన్ చేసేది వృధా ప్రయాస అనీ, రజినీ, ధనుష్ కలిసి నటించే అవకాశమే లేదని కొందరు కొట్టి పారేస్తున్నారు. ‘కూలీ’ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘జైలర్2’ చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి వినిపిస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.