తారక్ కి బాబాయ్ గా రాజశేఖర్.. కొరటాల ప్లాన్ మాములుగా లేదుగా!
on Jan 10, 2022
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరో, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
తారక్, కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు తారక్ తో చేయబోతున్న పాన్ ఇండియా మూవీ కోసం కూడా మరో సీనియర్ హీరోని కొరటాల రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్ కి బాబాయ్ గా రాజశేఖర్ కనిపించనున్నారని, ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం రాజశేఖర్ ని కొరటాల సంప్రదించగా, ఈ పాత్ర చేయడానికి రాజశేఖర్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
తారక్-కొరటాల పాన్ ఇండియా మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. తారక్ ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' పూర్తి చేశాడు. జనవరి 7 న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. ఇక కొరటాల విషయానికొస్తే చిరంజీవి హీరోగా 'ఆచార్య' సినిమాను చేశాడు. ఈ సినిమా ఫిబ్రవరి 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read