బాలయ్య సినిమాలో విలన్ గా రాజశేఖర్!
on Jun 20, 2022
సీనియర్ హీరోలు జగపతి బాబు, శ్రీకాంత్ వంటి వారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా రాణిస్తున్నారు. ఈ జాబితాలో మరో సీనియర్ హీరో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ చేరనున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఇన్నాళ్లకు ఆయన ఎంట్రీకి ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది.
'అఖండ' సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చేయనున్నాడు. బాలయ్య నడి వయస్కుడిగా నటించనున్న ఈ సినిమాలో ఆయన కూతురిగా శ్రీలీల కనిపించనుంది. ఇక ఇందులో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, దీని కోసం రాజశేఖర్ ని సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.
బాలయ్య హీరోగా నటించిన 'లెజెండ్'తో జగపతి బాబు విలన్ గా మారాడు. అప్పటినుంచి ఆయన కెరీర్ 'విలన్ గా మూడు సినిమాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆరు సినిమాలు' అన్నట్లుగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. అలాగే ఎప్పటినుంచో వివిధ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్న శ్రీకాంత్.. బాలయ్య సినిమా 'అఖండ'లో నెగటివ్ రోల్ లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం శ్రీకాంత్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. జగపతి బాబు, శ్రీకాంత్ మాదిరిగానే రాజశేఖర్ కూడా బాలయ్య సినిమాతో అదరగొడతాడేమో చూడాలి.