నిర్మాతని ముంచేసిన నాగార్జున
on Mar 7, 2017
ఈమధ్య కాలంలో ఓం నమో వేంకటేశాయ సినిమాకి మించిన డిజాస్టర్ లేదని తేల్చేస్తున్నారు సినీ విశ్లేషకులు. నాగార్జున - రాఘవేంద్రరావు కాంబో అంటే... విడుదలకు ముందే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్.. ఇలా స్టార్ కాస్టింగ్ కూడా భారీగా ఉంది. అందుకే... నమో వేంకటేశాయ కచ్చితంగా హిట్ అవుతుందని ఆశించారంతా. కానీ.. సీన్ రివర్స్ అయ్యి... నాగ్ సినిమా అట్టర్ ఫ్లాప్ చిత్రాల జాబితాలో చేరిపోయింది.
ఈ సినిమాకి కనీస ఓపెనింగ్స్ కూడా రాకపోవడం చిత్రసీమని ఆశ్చర్యపరిచింది. దాదాపు రూ.28 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. తీరా చూస్తే.. రూ.9 కోట్లు కూడా రాలేదు. అంటే.. దాదాపుగా రూ.20 కోట్ల నష్టమన్నమాట. ఓవర్సీస్‌లో ఈ సినిమాని రూ.5.5 కోట్లకు అమ్మితే... అక్కడ రూ.1 కోటి కూడా దక్కలేదని తెలుస్తోంది. నైజంలోనూ ఇదే తీరు. కనీసం 25 శాతం కూడా రికవర్ కాలేదని బయ్యర్లు వాపోతున్నారు. శాటిలైట్ రూపంలో రూ.10 కోట్లు దక్కించుకొంది కాబట్టి సరిపోయింది.. లేదంటే నిర్మాత ఏమైపోదుడో?