పాపం.... బాలయ్య నోరు జారాడా...???
on Feb 8, 2017

ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త హాట్ టాపిక్... ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా. నిన్నా మొన్నటి వరకూ.. అసలు ఈ ఊసే లేదు. బాలకృష్ణకూ ఆ ఆలోచన రాలేదు. సడన్‌గా ఎన్టీఆర్ కథపై సినిమా అనే అంశం తెరపైకి వచ్చింది. దాంతో పొలిటికల్ వర్గాల్లో దుమారం రేగుతోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తాడు ఓకే... మరి విలన్‌గా ఎవరిని చూపిస్తారు? చంద్రబాబు నాయుడునా? లక్ష్మీ పార్వతినా? అనే ఆసక్తి నెలకొంది. బాలయ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా... చంద్రబాబుని విలన్‌గా చూపించలేడు. లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేస్తే... కథ రసవత్తరంగా సాగే అవకాశం లేదు.
అందుకే అసలు విలన్ అనే ఎపిసోడే లేకుండా చేయొచ్చన్నది అందరి మాట. నిజానికి.. బాలయ్య మనసులో ఎన్టీఆర్ బయోపిక్ అనే ఆలోచనే లేదని, ఏదో నోరుజారి - నాన్నగారి జీవిత కథతో సినిమా చేస్తా.. అనేశాడని, దాన్ని మీడియా, రాజకీయ వేత్తలు, విశ్లేషకులు సీరియస్‌గా తీసుకొన్నారని నందమూరి కాంపౌండ్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించి కథ రాయడం అంత సులభమేం కాదు. ఎక్కడ మొదలెట్టాలి? ఎక్కడ ముగించాలి? అనే విషయాలు తెలిసుండాలి. ఈ సినిమాని తీయగల సమర్థుడైన దర్శకుడు ఉండాలి. అవేం లేకుండానే.. బాలయ్య ఏదో మాట వరసకు ఎన్టీఆర్ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడని, ఇప్పుడు అదే బాలయ్య పీకకు చుట్టుకునే వ్యవహారంలా తయారైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరూ సీరియస్‌గా తీసుకొన్నారు కాబట్టి, తానూ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి బాలయ్య ఏం చేస్తాడో ఏంటో..??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



