అప్పడే కాంట్రవర్సీ మొదలు..?
on Jul 4, 2017

సాహసాలు చేయడంలో బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. ఉదాహరణకు ఆయన వందో సినిమానే తీసుకోండి! ఎవరూ ఊహించని సబ్జెక్ట్ ని ఎన్నుకొని, హిట్ కొట్టి చూపించాడు. ఇక 101వ సినిమా దర్శకుని విషయంలో సోషల్ మీడియా రకరకాల పేర్లు వినిపిస్తే... అందరికీ ఝలక్ ఇస్తూ పూరీ జగన్నాథ్ కి ఓకే చెప్పేశారు.
ఈ లోపే తన తండ్రి విశ్వవిశ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు బయోపిక్ ని సినిమాగా తీస్తానని స్టేట్మెంట్ ఇచ్చేసి కొత్త చర్చకు తెరలేపారు. అందులో ఎన్టీయార్ గా బాలయ్యే చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. తండ్రి పాత్రను కొడుకే వెండితెరపై పోషంచడం భారత చలనచిత్ర చరిత్రలో ఇదే ప్రథమం. ఆ విధంగా మరో సాహసానికి తెరలేపారు బాలయ్య.
ఇదంతా ఓ ఎత్తు ప్రస్తుతం జరిగిన పరిణామం ఒకెత్తు. అదేంటంటే... ఎన్టీయార్ బయోపిక్ కి దర్శకత్వం వహించేది ఎవరు? అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయిన ఈ తరుణంలో... వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తన తండ్రి బయోపిక్ ని తెరకెక్కించే బాధ్యతను అప్పగించి తెలుగు నేలంతా అవాక్కయ్యేలా చేశారు బాలయ్య.
రక్తచరిత్ర, వంగవీటి బయోపిక్ ల ద్వారా పలు వివాదాలను తెరలేపిన రామ్ గోపాల్ వర్మకు... తెలుగు తెర వేల్పు, తెలుగు వాడి ఆత్మగౌరవ ప్రతీక అయిన ‘అన్న’ నందమూరి తారకరాముని బయోపిక్ తెరకెక్కించే బాధ్యత అప్పజెప్పడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అందుకే బాలయ్య సాహసానికి హేట్సాఫ్ చెప్పక తప్పదు.
ఎన్టీయార్ చరిత్రలో ప్రధమార్థం కలర్ ఫుల్. ద్వితీయార్థం రాజకీయ విజయ విహారం, ఒడిదుడుకులుతో సాగుతుంది. కానీ... చివరి అంకం మాత్రం కాంట్రవర్సీతో కూడుకొని ఉంటుంది. మరి అశేషమైన తెలుగు ప్రజల ఆరాధ్యుని కథ తీసేటప్పుడు ఈ విషయాల్లో వర్మ ఎలాంటి జాగ్రత్త తీసుకుంటాడో చూడాలి.
ఇదిలా వుంటే... ఈ వేడి మీదే వర్మ తన ‘ఎన్టీయార్ బయోపిక్’పై మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటనలో ఎన్టీయార్ గొప్పతనాన్నీ, ఆయనపై తనకున్న అభిమానాన్ని, ఎన్టీయార్ తో తనకున్న అనుభవాల్నీ.. తనకు దక్కిన ఈ అదృష్టాన్నీ ఏకరవు పెడుతూనే... ‘‘ఎన్టీయార్ శత్రువులెవరో... నమ్మక ద్రోహులెవరో.. ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుకాల అసలు కాంట్రవర్సీలేమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికీ నా NTR సినిమా ద్వారా చూపిస్తాను’’ అని స్టేట్మెంట్ ఇచ్చేసి అప్పుడే కొత్త కాంట్రవర్సీకి శ్రీకారం చుట్టేశాడు వర్మ. ఈ ఒక్క ప్రకటనతోనే ఎలక్ట్రానిక్ మీడియాకు కావల్సినంత స్టఫ్ ఇచ్చేశాడు. ముందు ముందు ఈ సినిమా ద్వారా ఇంకెన్ని పోకడలు పోతాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



