శ్రీనువైట్ల ఛాప్టర్ క్లోజేనా..అసలు శ్రీనుకి ఏమైంది..?
on Apr 14, 2017
శ్రీనువైట్ల..జంధ్యాల, ఈవీవీ తర్వాత ఇక కామెడీ మూవీస్‌కి చెల్లు చీటి అని అనుకుంటున్న టైంలో నేనున్నానంటూ వచ్చి ప్రేక్షకుల్ని నవ్వించిన డైరెక్టర్. శ్రీను సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్నంతగా పేరు తెక్చుకున్నాడు. వెంకీ, ఢీ, రెడీ వంటి చిత్రాలతో తన మార్క్‌ను చూపించిన శ్రీను ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లను సైతం డైరెక్ట్ చేసి తన సత్తా చాటాడు. మహేశ్ బాబుతో దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇంత ట్రాక్ రికార్డు ఉన్న శ్రీనుకి ఆగడు నుంచి బ్యాడ్ టైం స్టార్టయ్యింది..తీసిన ప్రతి సినిమా మూస కొట్టుడు కావడంతో సగటు ప్రేక్షకుడు విసుగు చెంది వాటిని ఆదరించడం మానేశాడు.
దీంతో ట్రాక్ మార్చి రామ్‌చరణ్‌తో బ్రూస్లీ తీశాడు..ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ డిజాస్టర్ కావడంతో శ్రీను పని అయిపోయిందనుకున్నారు. కానీ మిస్టర్ రూపంలో మరో ఛాన్స్ దొరికింది. స్టార్ హీరోలతో రెండు భారీ డిజాస్టర్లు ఇచ్చిన తర్వాత కూడా వరుణ్ తేజ్ శ్రీనువైట్లను నమ్మాడు. కానీ ఆ నమ్మకాన్ని శ్రీను నిలబెట్టుకోలేదంటున్నారు ఆడియన్స్. తన రెగ్యులర్ బకరా కాన్సెప్ట్‌తో పాటు పాత సినిమాలన్నింటిని మిక్స్ చేసి మిస్టర్‌ని తీర్చిదిద్దాడు. బ్రహ్మానందాన్నీ తీసుకోకపోవడం ప్లస్సో, మైనస్సో తెలియదు కానీ ఆ స్పెయిన్ ఏపిసోడ్స్ కాకుండా మిగతా సినిమా అంతా ఒక మూసలా ఉందంటున్నారు ఆడియన్స్. అన్నింటికన్నా పెద్ద డ్రా బ్రాక్ ఏంటంటే మిగతా దర్శకుల్లాగా శ్రీను సొంతంగా కథ రాసుకోలేడు.. కాబట్టి వేరే రైటర్ల పైన ఆధారపడటం ఒక రకంగా మైనస్. రైటర్ల కొరత టాలీవుడ్‌ని వేధిస్తున్నఈ టైంలో శ్రీనువైట్ల చాప్టర్ ఇక క్లోజే అని చెప్పవచ్చు.