రాజమౌళి సినిమా కంటే ముందే.. ఓ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్న మహేష్?
on Aug 16, 2024
రాజమౌళి వంటి దర్శకులు ఒక సినిమా చెయ్యాలంటే ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో మనం చూశాం. రాజమౌళి విషయంలో ఇది ‘బాహుబలి’ నుంచి మొదలైంది. ఈ సిరీస్ కోసం ప్రభాస్ నాలుగేళ్లపాటు రాజమౌళి కాంపౌండ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని 2018లో స్టార్ట్ చేశారు. అయితే మధ్యలో కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ మరింత ఆలస్యం జరిగి 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత మహేష్‌తో సినిమా చేస్తున్న ప్రకటించిన రాజమౌళి ఇప్పుడు మహేష్‌ను కూడా తన కాంపౌండ్‌లో ఉంచుకున్నాడు. మహేష్ మరో సినిమా చేసే అవకాశం లేదు. ఈ ఏడాది చివరలో సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక రిలీజ్ ఎప్పుడు అవుతుందనేది చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. మహేష్ ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేమింటే ఈ సినిమా కంటే ముందే మహేష్ ప్రేక్షకుల్ని పలకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏ సినిమా అయినా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. విదేశాల్లోని ప్రేక్షకులు కూడా మన సినిమాలను ఆదరిస్తున్నారు. అలాగే హాలీవుడ్ సినిమాలు సైతం ప్రపంచంలోని వివిధ భాషల్లో విడుదల కావడం వల్ల అవి కూడా మనకు మరింత దగ్గరవుతున్నాయి. 2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పలు భారతీయ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. ముఖ్యంగా జగపతిబాబు, నాని, అలీ, బ్రహ్మానందం, రవిశంకర్, షేకింగ్ శేషు వంటి వారు తెలుగు వెర్షన్‌కు తమ వాయిస్‌ను అందించారు. దీనివల్ల సినిమాకి చాలా మంచి ఆదరణ లభించింది.
తాజాగా ‘ది లయన్ కింగ్’కి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా.. ది లయన్ కింగ్’ చిత్రాన్ని రూపొందించారు. ముఫాసా, స్కార్ చిన్నతనం నుంచి ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత ముఫాసా రాజు ఎలా అయ్యాడు, స్కార్ బలహీనుడు కావడానికి కారణాలు ఏమిటి అనే అంశాలతో ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే హిందీలో షారూక్ ఖాన్, ఆర్యన్ ఖాన్, అబ్‌రమ్ ఖాన్ వంటి వారు డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు తెలుగు వెర్షన్‌కి ఎవరు డబ్బింగ్ చెబుతారు అనే విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. సినిమాలో ప్రధాన పాత్ర అయిన ముఫాసాకు సూపర్‌స్టార్ మహేష్ డబ్బింగ్ చెబుతాడు అనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంతకుముందు చాలా సినిమాలకు వాయిస్ ఓవర్ చెప్పారు మహేష్. అయితే ఒక పాత్రకు ఇప్పటివరకు డబ్బింగ్ చెప్పలేదు. మరి ఈ సినిమాకి సంబంధించి వినిపిస్తున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే ‘ముఫాసా’ చిత్రానికి ఒక కొత్త లుక్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబర్ 20న డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోంది.
Also Read