స్టార్ హీరో డిమాండ్స్ కి భయపడ్డ నగల వ్యాపారి
on Oct 23, 2017

బ్రాండింగ్ అనేది ఏ వ్యాపారంలో అయినా ఖచ్చితం. సాధారణంగా, ఒక వస్తువు గురించి జనాలకి తెలియాలంటే ఆకర్షణీయ పద్ధతులు వెతుకుతుంటారు. కొందరు తమ వస్తువు యొక్క గొప్ప ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తే, మరి కొందరు అతి సులువయిన పద్ధతి ఎన్నుకుంటారు. అదేంటంటారా... ఒక స్టార్ హీరోనో... లేదా హీరోయిన్నో ప్రచారకర్తగా పెట్టుకోవడం. ఎంత డబ్బయినా కుమ్మరించి పేరున్న నటుడిని ప్రచార కర్తగా పెట్టుకుంటే, తమ బ్రాండ్ మార్కెట్ లో దూసుకుపోస్తుంది అనేది అందరూ నమ్మే సిద్ధాంతం.
అయితే, ఈ మధ్య ఏ టీవీ పెట్టినా ప్రోగ్రామ్స్ లేదా సినిమాలు లేదా వార్తల మధ్య వచ్చే ప్రకటనలలో ఒక నగల ప్రకటన క్రమం తప్పకుండా దర్శనమిస్తుంది. దీనికి ప్రచార కర్త మరెవరో కాదు ఆ బ్రాండ్ యొక్క యజమానియే. అదేంటి అన్ని డబ్బులు పెడుతున్నాడు, ఒక స్టార్ హీరోని ప్రచారకర్తగా పెట్టుకుంటే బాగుండేది కదా అని దాదాపు అందరూ అభిప్రాయపడ్డారు. అయితే, అసలు విషయం ఏంటంటే, ఆ నగల వ్యాపారి ముందుగా ఒక టాప్ హీరోని కలిశాడట. కానీ, సదరు హీరో బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు భారీ మొత్తం డిమాండ్ చేసాడట. అతగాడి డిమాండ్లకు ఖిన్నుడయిన యజమాని... ఆ హీరోకి అంత ఇవ్వడం కన్నా ఆ డబ్బులు ప్రచారం కోసం పెట్టడం నయం అనుకున్నాడట.
అనుకున్నదే తడవుగా, తానే స్వయంగా ప్రచార కర్త అవతారం ఎత్తాడు. మధ్య తరగతినే కాకుండా దాదాపు అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా ప్రకటనలు ఉండడంతో ఆ బ్రాండ్ పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ నగల కొట్టు ముందు జనాలు బార్లు తీరుతున్నారు. తన బ్రాండ్ కి క్రేజ్ తేవడమే కాకుండా తాను పాపులర్ అయిపోయాడు ఆ నగల వ్యాపారి. ఒక విధంగా ఆ స్టార్ హీరో భయపెట్టడం సదరు నగల బ్రాండ్ కి కలిసొచ్చిందనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



