మెగాస్టార్ దర్శకుడితో బాలయ్య!
on May 15, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ తన 108 వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ దర్శకుడు ఎవరో కాదు కె.ఎస్.రవీంద్ర(బాబీ కొల్లి).
రచయితగా పలు సినిమాలకు పని చేసిన బాబీ.. 'పవర్' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. దర్శకుడిగా ఇప్పటిదాకా ఐదు సినిమాలు చేయగా.. 'సర్దార్ గబ్బర్ సింగ్' తప్ప మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య'తో ఈ ఏడాది అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అదే ఉత్సాహంతో ఇప్పుడు మరో సీనియర్ హీరో బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య-బాబీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారని న్యూస్ వినిపిస్తోంది.
దిల్ రాజు బ్యానర్ లో అటు బాలయ్య, ఇటు బాబీ సినిమాలు కమిట్ అయ్యారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. 'బలగం' ఫేమ్ వేణు దర్శకత్వంలో బాలయ్య సినిమాతో పాటు, రజినీకాంత్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటాయని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బాలయ్య-బాబీ కాంబోలో సినిమా ఉంటుందని న్యూస్ రావడం ఆసక్తికరంగా మారింది.