బాలయ్య, స్నేహ జోడీ.. భయపడుతున్న ఫ్యాన్స్?
on Jul 31, 2020
నందమూరి బాలకృష్ణ, స్నేహ కాంబినేషన్‌లో ఇదివరకు 'మహారథి', 'పాండురంగడు' చిత్రాలు వచ్చాయి. రెండూ ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో గట్టిగా జరుగుతోంది. బాలకృష్ణతో బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న బీబీ3 మూవీలో ఓ నాయికగా స్నేహను ఎంపిక చేశారనేది ఆ ప్రచార సారాంశం. బాలకృష్ణ, బోయపాటి కలిసి పనిచేస్తోన్న మూడో సినిమా ఇది. 'సింహా', 'లెజెండ్' సినిమాల తరహాలోనే మూడో సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అయి హ్యాట్రిక్ సాధించాలనే తపనతో ఆ ఇద్దరూ పని చేస్తున్నారు.
తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీలో ఓ కొత్త తారను తీసుకోనున్నారంటూ కొద్ది రోజుల క్రితం న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు స్నేహ పేరు బయటకు రావడం గమనార్హం. బోయపాటి మునుపటి మూవీ 'వినయ విధేయ రామ'లోనూ స్నేహ నటించింది. అందులో ఆమె రామ్‌చరణ్‌కు వదినగా, ప్రశాంత్ భార్యగా కనిపించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయింది. ఇలా బాలకృష్ణతో చేసిన సినిమాలూ, అటూ బోయపాటితో చేసిన సినిమా ఆడకపోవడంతో ఆ ఇద్దరికీ స్నేహ కలిసి రాలేదని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఆమెను ఈ సినిమాలో తీసుకోవడం నిజమే అయితే ఆ నెగటివ్ సెంటిమెంట్ పనిచేసి, సినిమాని ఎక్కడ దెబ్బతీస్తుందోనని వారు భయపడుతున్నారు.
నిజానికి స్నేహ చక్కని నటి అనే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, రాధా గోపాలం, మధుమాసం, శ్రీరామదాసు, రాజన్న వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మనకు సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి, బాలయ్య-స్నేహ జోడీ హిట్ పెయిర్‌గా ఇదివరకు నిలవలేదు కాబట్టి, ఇప్పుడు కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు. అయితే.. అసలు ఈ సినిమాలో స్నేహ నిజంగా చేస్తోందా, లేదా అనే విషయం మాత్రం ధ్రువపడలేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
