కథ, నిర్మాత రెడీ.. వినాయక్‌తో సినిమా అంటేనే భయపడిపోతున్న హీరోలు!
on Jun 3, 2025
2000వ దశకంలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుల్లో పూరి జగన్నాథ్, ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్ సంచలన విజయాలు అందుకున్నారు. వీరిలో రాజమౌళి.. ఫెయిల్యూర్ అనేది లేకుండా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. మరో దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అతను చివరగా గత ఏడాది చేసిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు పూరి. విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. టబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తారు.
ఇక వి.వి.వినాయక్ విషయానికి వస్తే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నితిన్ వంటి పెద్ద స్టార్స్‌తో బ్లాక్ బస్టర్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన కెరీర్ స్తబ్దుగా మారిపోయింది. 2018లో సాయిధరమ్‌తేజ్‌తో చేసిన ఇంటెలిజెంట్.. ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఒక్క సినిమా ఫ్లాప్‌తో హీరోలెవరూ వినాయక్‌తో సినిమా చేసేందుకు ముందుకు లేదు. 2023లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో హిందీలో ఛత్రపతి రీమేక్ చేశారు. అది కూడా నిరాశనే మిగిల్చింది. దానికితోడు వినాయక్‌ని ఆరోగ్య సమస్యలు వేధించాయి. అయితే ఇటీవల ఆయన కోలుకొని మునుపటి ఉత్సాహంతోనే ఉన్నారని తెలుస్తోంది. మరో సూపర్‌హిట్ సినిమా చేసి హిట్ ట్రాక్‌లోకి రావాలని వినాయక్ ఆశిస్తున్నారు. తన నెక్స్‌ట్ సినిమా చేసేందుకు నిర్మాతను కూడా సెట్ చేస్తున్నారు. ప్రజెంట్ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యే మంచి కథతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అయితే హీరో ఎవరు అనేది మాత్రం సస్పెన్స్‌లోనే ఉంది.
ప్రస్తుతం వినాయక్ ఫామ్‌లో లేకపోవడం వల్ల ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న స్టార్ హీరోలెవరూ అతనితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయినప్పటికీ ఇద్దరు, ముగ్గురు హీరోలను అప్రోచ్ అయ్యారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో యంగ్ హీరోలతో వెళితేనే బెటర్ అని భావించి సిద్ధు జొన్నలగడ్డతో సినిమా చేసేందుకు వినాయక్ ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ‘డిజె టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సూపర్‌హిట్ సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు.. ఇటీవల భాస్కర్‌తో చేసిన ‘జాక్’ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో డైరెక్టర్ల ఎంపిక విషయంలో మరింత కేర్ తీసుకోవాలని సిద్ధు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అంతకుముందు భాస్కర్ ఎన్నో సూపర్‌హిట్స్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో వెనకపడ్డారు. అలాంటి డైరెక్టర్‌కి ఛాన్స్ ఇవ్వడం వల్ల తను ఓ డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 8 సంవత్సరాలుగా హిట్ అనేది లేని వినాయక్‌తో సిద్ధు సినిమా చేసే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మరి ఇప్పుడు వినాయక్‌ని హిట్ ట్రాక్‌లో పెట్టే హీరో ఎవరు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



