‘అర్జున్ రెడ్డి’ మూడువేల కోట్లు వసూలు చేస్తది... ఏంటంట?
on Aug 28, 2017
* ‘అర్జున్ రెడ్డి’ హిట్. ఆ మాటకొస్తే సూపర్ హిట్. ఇంకా మాట్లాడితే ‘బాహుబలి’ రికార్డులను కూడా బద్దలు చేసేసి... మూడు వేల కోట్లు వసూలు చేసే సినిమా. అహ.. సరదాగా అనుకుందాం. అందుకని ఆ సినిమాను మరో ‘మాయాబజార్’ అనాలా? తెలుగు సినిమాకు కొత్త వ్యాకరణం చెప్పిందనాలా? ఆ సినిమాను ఓ ట్రెండ్ సెట్టర్ అనాలా? సోషల్ మీడియాలో ఆ సినిమాపై కురిపిస్తున్న ప్రశంసల ‘అతి’ చూస్తుంటే మతి పోతోంది.
* ‘దేవదాసు’ కథను సుఖాంతం చేసి, దానికి ఓ 20 లిక్ లాక్ లను జోడించి, రెండుమూడు పచ్చి బూతులను వినిపించి, అరడజను బూతులను చూపించి... తీసిన సినిమా ట్రెండ్ సెట్టర్ అయితే... ఇక రాబోయే సినిమాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయ్? ఆ సినిమాల పుణ్యమా అని యువతరం ఏ స్థాయిలో నిర్వీర్యం అవుతుంది? చాలామందిలో తెలెత్తుతున్న ప్రశ్నలివి.
* ‘అర్జున్ రెడ్డి’సినిమాలో ఏం బావుంది? అనడిగితే... ‘హీరో కేరక్టరైజేషన్’ అని చెప్పొచ్చు. నేటి యువత యాటిడ్యూడ్ కి దగ్గరగా... సరదాగా.... ఎమోషనల్ గా.... భావోద్వేగపూరితంగా హీరో కేరక్టరైజేషన్ ఉంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే... ఇదంతా చూడ్డానికే. ఆచరణకు పనికిరానిది. అసలు ఆచరణీయంగా నేటి హీరోల పాత్రలు ఉంటున్నాయా? అనే ప్రశ్నలు కూడా ఇక్కడ రావొచ్చు. అవును... రావడంలేదు... నిజమే.
* బయటి ప్రపంచంలో ప్రతి ఒక్కడికీ ఓ కథ ఉంటుంది. ఎవడి కథలో వాడే హీరో. వాడు మంచోడు కావొచ్చు, చెడ్డోడు కావొచ్చూ... రెండు లక్షణాలూ ఉన్నోడు కావొచ్చు. కానీ... తెరపై ఓ కథ చూపించేటప్పుడు దానికి కొన్ని పద్దతులుంటాయ్. బయటి వెధవల కథలన్నీ తెరపై చూసిస్తే... దానికి ప్రభావితమై... ఇంకో పది మంది వెధవలు తయారయ్యే ప్రమాదం ఉంది. అందుకే... బలమైన మాధ్యమమైన సినిమా ద్వారా, ముఖ్యంగా అందులో హీరో ద్వారా... సాధ్యమైనంతవరకూ మంచే చెప్పాలి. అది కూడా వినోదంగా. ఇప్పటివరకూ జరిగింది కూడా అదే. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాల పుణ్యమా అని సైకోగాళ్లను హీరో పాత్రలుగా చూపించడం మొదలవుతుంది. దాని ప్రభావం యువతరంపై పడితే... ఎవడు రెస్పాన్సిబులిటీ?
* దానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. 18ఏళ్ల లోపు పిల్లలు ఆ సినిమాను చూడకూడదు. అసలు.. ఈ మధ్య కాలంలో వచ్చిన అసలుసిసలైన ‘ఏ’సర్టిఫికెట్ సినిమా ‘అర్జున్ రెడ్డి’. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి సినిమాపై అనపరపు హంగామా సృష్టించడం, ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేయడం... అవి పిల్లల్ని ఆకర్షించడం, వాళ్లూ సినిమా చూడ్డానికి ఆరాటపడటం... ఎలాగొలా చూసేయడం.. ఇదంతా చెడుకు దారితీసే పరిణామం కాక మరేంటి? ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి.