పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్.. ఇకపై అలాంటి సమస్యలు ఉండవట?
on Apr 1, 2025
భారతదేశంలో సెంటిమెంట్స్ ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొన్ని రంగాల్లో ఈ సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వాటిలో ప్రధానంగా కనిపించేది సినిమా రంగం. ఒక చిన్న విషయం వల్ల మంచి జరిగినా, చెడు జరిగినా దాన్నే సెంటిమెంట్‌గా భావించే లక్షణం సినిమా వారికి ఉంటుంది. సినిమా రంగంలో రాణించాంటే టాలెంట్ ఉంటే సరిపోదు.. దానికి తగిన అదృష్టం కూడా ఉండాలని అందరూ చెప్తుంటారు. కొంతమంది కెరీర్‌ని పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇక అదృష్టాన్ని మించి జాతకం కూడా బాగుండాలి అంటారు. ఇక సెంటిమెంట్ విషయానికి వస్తే.. రకరకాల సెంటిమెంట్స్ సినిమా వారికి ఉంటాయి. వాటిలో పేరు ఒక సెంటిమెంట్ ఒకటి. అసలు పేరు ఒకటైతే.. స్క్రీన్ నేమ్ మరొకటి ఉంటుంది. అది నటీనటుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. టెక్నీషియన్స్ దాదాపుగా వారి ఒరిజినల్ పేరుతోనే కొనసాగుతారు. పాతతరం నటీనటుల నుంచి చూస్తే చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ అసలు పేర్లు పక్కన పెట్టి, స్క్రీన్ నేమ్‌తోనే పాపులర్ అయ్యారు. సాధారణంగా సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యే ముందు పేరు మార్చుకుంటూ ఉంటారు. కానీ, విచిత్రంగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ పేరు మార్చుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
2003లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి చిత్రంతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తన రెండో సినిమా ఆర్యతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆ తర్వాత వరసగా చేసిన సినిమాలు అతన్ని హీరోగా ఒక రేంజ్‌కి తీసుకెళ్ళాయి. 2024లో వచ్చిన పుష్ప2 సాధించిన ఘనవిజయంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. దాదాపు రూ.1800 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాలోనే నెంబర్‌వన్ సినిమాగా నిలిచింది పుష్ప2. అంతటి అద్భుతమైన విజయం అందుకున్నప్పటికీ ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చెయ్యలేని పరిస్థితికి వెళ్లిపోయారు బన్నీ. డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ఇప్పటికీ హాస్పిటల్ బెడ్‌కి పరిమితం అయి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి ఊహించని ఘటనల వల్ల అల్లు అర్జున్‌కి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే తన పేరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని జోతిష్యులు చెప్పినట్టు సమాచారం.
ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అల్లు అర్జున్.. దాన్ని కొనసాగించాలన్నా, అతని క్రేజ్ మరింత పెరగాలన్నా అతని జాతకం ప్రకారం న్యూమరాలజీని దృష్టిలో ఉంచుకొని పేరు మార్పు అవసరం అని పండితులు చెప్పినట్టు తెలుస్తోంది. అలా చేస్తే ఎవరూ ఊహించని విధంగా జరిగిన సంధ్య థియేటర్ ఘటన వంటివి మళ్ళీ మళ్ళీ జరగవని వారు ఘంటాపథంగా చెప్తున్నారట. ఈ వార్తలో ఎంత నిజం వుందో తెలీదుగానీ, అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. దీని ప్రకారం అల్లులో ఒక ‘యు’, అర్జున్‌లో ఒక ‘ఎన్’ అదనం చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తన పేరు మార్పు విషయంలో అల్లు అర్జున్ స్వయంగా స్పందిస్తే తప్ప ఇది నిజమని చెప్పే వీలు లేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
