'అఖండ' హిందీ రీమేక్ లో 'ఆర్ఆర్ఆర్' స్టార్!
on Jan 23, 2022
నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్, టికెట్ ధరల తగ్గింపు వంటి ప్రతికూల పరిస్థితుల నడుమ విడుదలైనప్పటికీ అఖండ కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు పలు థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకొని సంచలనం సృష్టించింది. ఇటీవల ఓటీటీలో విడుదలై అక్కడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న అఖండను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
దేవాలయాల పరిరక్షణ కాన్సెప్ట్ తో తెరకెక్కిన అఖండకు హిందీలోనూ భారీ ప్రేక్షకాదరణ దక్కే అవకాశముంది. దానికి తోడు ఇందులో మాస్ ప్రేక్షకులను మెప్పించే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల పుష్ప మూవీ హిందీలో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అఖండకు కూడా హిందీలో ఆ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని, హిందీలో డబ్ చేసి విడుదల చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే కొందరు బాలీవుడ్ నిర్మాతలు మాత్రం అఖండను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. అఖండ హిందీ రీమేక్ రైట్స్ కోసం ఇప్పటికే కొందరు నిర్మాతలు అఖండ మేకర్స్ తో సంప్రదింపులు జరుగుతున్నారని సమాచారం.
అఖండ హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ నటిస్తాడని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' స్టార్ అజయ్ దేవ్గణ్ పేరు వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా కీలక పాత్రలో అజయ్ దేవ్గణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. గతంలో పలు సౌత్ సినిమాలు రీమేక్ చేసి హిట్ కొట్టిన అజయ్ దేవ్గణ్ ఇప్పుడు అఖండ రీమేక్ పై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read