'ఎన్టీఆర్ 30'లో విజయశాంతి!
on Sep 5, 2022
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో పట్టాలెక్కే అవకాశముంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో లేడీ అమితాబ్ విజయశాంతి నటించనుందని ప్రచారం జరుగుతోంది.
గతంలో ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ఒక పవర్ ఫుల్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించారు. అలాగే ఇప్పుడు 'ఎన్టీఆర్ 30'లో ఒక పవర్ ఫుల్ లేడీ పాత్రను డిజైన్ చేశారట కొరటాల శివ. ఈ పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్న విజయశాంతి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. 2020లో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ పై అంతగా ఆసక్తి చూపించట్లేదు. 'సరిలేరు నీకెవ్వరూ' తరువాత ఎన్నో మూవీ ఆఫర్స్ వచ్చినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు 'ఎన్టీఆర్ 30'లో కీలక పాత్ర కోసం కొరటాల ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెకు కొరటాల కథ చెప్పగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.