షాకింగ్.. సుజీత్ గ్యాంగ్ స్టర్ మూవీ ఆగిపోయింది!
on May 15, 2024
ఇప్పటిదాకా తన దర్శకత్వంలో వచ్చింది రెండు సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth). 'రన్ రాజా రన్'తో దర్శకుడిగా పరిచయమైన సుజీత్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో 'సాహో' సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ చిత్రం తెలుగునాట అంతగా ఆదరణ పొందనప్పటికీ.. నార్త్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక సుజీత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో 'ఓజీ' అనే గ్యాంగ్ స్టర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే 70 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. ఈ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని(Nani)తో సుజీత్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
'సరిపోదా శనివారం' చిత్రంతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న నాని.. తన తదుపరి సినిమాని సుజీత్ డైరెక్షన్ లో చేయాల్సి ఉంది. నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. "ఒక వయలెంట్ మ్యాన్ హింసని వదిలేస్తే.. అతని జీవితం ఎలా తలకిందులైంది." అంటూ ఆ సమయంలో విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పైగా ఇందులో నాని గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడని న్యూస్ రావడంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని న్యూస్ తెరపైకి వచ్చింది. బడ్జెట్ లెక్కలు చూసుకున్న తర్వాత ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేయాలని నిర్మాత డీవీవీ దానయ్య నిర్ణయించుకున్నారట. అదే నిజమైతే నాని ఫ్యాన్స్ కి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి.
అయితే ఒకవేళ సుజీత్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడినా.. నాని చేతిలో ఇతర సినిమాలు ఉన్నాయి. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే, 'బలగం' వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే పీరియాడిక్ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.