ఓ ఫ్లాప్ హీరో.. ఓ ఫ్లాప్ డైరెక్టర్.. మైత్రి బిగ్ రిస్క్..?
on Sep 10, 2025

2013 లో వచ్చిన 'బాద్‍షా' తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల, 2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత హీరో నితిన్ హిట్ చూడలేదు. అంటే శ్రీను వైట్ల హిట్ చూసి 12 ఏళ్ళయితే.. నితిన్ హిట్ చూసి ఐదేళ్లు అయింది. ఇలా ఫ్లాప్స్ లో ఉన్న ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని సమాచారం.
ఫ్లాప్స్ లో ఉన్న దర్శకులు, హీరోలతో సినిమాలు చేయడానికి నిర్మాణ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపించవు. అలాంటిది మైత్రి సంస్థ మాత్రం.. ఫ్లాప్ డైరెక్టర్, ఫ్లాప్ హీరో కాంబినేషన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. శ్రీను వైట్ల, నితిన్ ల ప్రతిభ.. స్క్రిప్ట్ మీద నమ్మకంతోనే మైత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు శ్రీను వైట్ల ఎన్నో ఆల్ టైం ఎంటర్టైనర్స్ ని అందించారు. సోషల్ మీడియాలో సగం మీమ్ టెంప్లేట్స్ ఆయన సినిమాల్లోవే. శ్రీను వైట్ల కమ్ బ్యాక్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సరైన స్క్రిప్ట్ దొరికితే ఇప్పటికీ బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయగల ప్రతిభ ఆయన సొంతం. ఇక నితిన్ కూడా సరైన ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ దొరికితే ఒక ఆట ఆడుకుంటాడు. ఇప్పుడు ఆలాంటి స్క్రిప్ట్ నే ఈ కాంబోకి కుదిరినట్లు టాక్.
నిజానికి శ్రీను వైట్లతో 'అమర్ అక్బర్ ఆంటోని', నితిన్ తో 'రాబిన్‌హుడ్' చేసి పరాజయాలు చూసింది మైత్రి మూవీ మేకర్స్. అయినప్పటికీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ చేయడానికి ముందుకు రావడం విశేషం. మరి శ్రీను వైట్ల-నితిన్ కలిసి మంచి హిట్ ఇచ్చి.. పాత లెక్కలు సరి చేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



