ఊహించని కాంబో.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!
on Apr 23, 2024
అతికొద్ది కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో స్టార్ గా ఎదిగాడు. అయితే కొన్నేళ్లుగా విజయ్ కి సరైన విజయాలు దక్కడం లేదు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేసిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'పై ఎన్నో ఆశలు పెట్టుకోగా అది నిరాశపరిచింది. మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది. దీంతో ఇంకెవరైనా స్టార్ డైరెక్టర్ తో విజయ్ సినిమా పడితే బాగుంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో విజయ్ సినిమా చేసే అవకాశముందనే వార్త ఆసక్తికరంగా మారింది.
'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్(Prabhas) తో 'సలార్' చేశాడు నీల్. త్వరలోనే 'సలార్-2' కూడా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తో ఒక సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు రామ్ చరణ్(Ram Charan) వంటి స్టార్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ కన్ను.. యంగ్ స్టార్ విజయ్ దేవరకొండపై పడటం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ వెళ్ళాడు. వీరి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రానుందని, దానికి సంబంధించిన చర్చల కోసమే విజయ్ ని నీల్ కలిశాడని న్యూస్ వినిపిస్తోంది. ఓ రకంగా ఇది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. 'సలార్-2'తో పాటు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక.. విజయ్ తో నీల్ సినిమా చేస్తాడేమో చూడాలి. ఒకవేళ నిజంగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా పడితే మాత్రం.. ఒక్కసారిగా విజయ్ రేంజ్ మారిపోతుంది అనడంలో సందేహం లేదు.