సర్దార్ తో శ్రీమంతుడు..?
on Sep 1, 2015
వరుసగా ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు... తన మూడో సినిమాను కూడా అదే రేంజ్ బడా హీరోతో తీయాలని ప్లాన్ చేస్తుంటాడు. శ్రీమంతుడు సినిమాతో మహేశ్ బాబకు భారీ హిట్ ఇవ్వడంతో పాటు ద్వితీయ విఘ్నాన్ని కూడా దిగ్విజయంగా అధిగమించిన దర్శకుడు కొరటాల శివ... తన తదుపరి సినిమా ఎవరితో తెరకెక్కిస్తాడనే విషయం ఆసక్తిగా మారింది.
అల్లు అర్జున్, ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరితో కొరటాల నెక్ట్స్ మూవీ ఉంటుందని ఇండస్ట్రీలో ప్రచారం కూడా సాగుతోంది. మరికొందరు కొరటాలను ఆల్రెడీ ఎన్టీఆర్ బుక్ చేసుకున్నాడని కూడా చర్చించుకుంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా... కొరటాల శివ విషయంలో ఇప్పుడు మరో న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్, మహేశ్ బాబుతో వరుసగా సినిమాలు తెరకెక్కించిన కొరటాల... తదుపరి పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా దాసరి నారాయణరావు నిర్మాతగా రూపొందబోయే సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని అనుకున్నా... లేటెస్ట్ గా దర్శకుడు కొరటాల శివ రేసులోకి వచ్చాడని తెలుస్తోంది. దాసరి నుంచి కొరటాల శివకు కబురు వచ్చిందని... పవన్ కళ్యాణ్ కు సూటయ్యే స్టోరీని రెడీ చేసుకోవాలని దర్శకరత్న కొరటాలను కోరాడని కొందరు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా... పవన్ సినిమాకు మెగా ఫోన్ పట్టుకునే ఛాన్స్ దక్కించుకుంటే కొరటాల రేంజ్ మరింత పెరిగినట్టే చెప్పాలి.