సహజ కవిగా, సామాజిక స్పృహ ఉన్న నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న ఎం.ఎస్.రెడ్డి!
on Aug 16, 2024
ఎం.ఎస్.రెడ్డి.. ఈ పేరు వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరెన్నో అద్భుత విజయాలు దాగి ఉన్నాయి. కవిగా, గేయ రచయితగా, నిర్మాతగా ఎన్నో సంచలన విజయాలు సాధించారు. ఆయన రచనలు, సినిమాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ముక్కు సూటితనం ఆయనకు పెట్టని ఆభరణం. తప్పు జరిగితే నిలదీసే ధైర్యం, తెగువ ఉన్న వ్యక్తి. ఆయన జీవించి ఉన్న రోజుల్లోనే ‘ఇది నా కథ’ అంటూ తన స్వీయ చరిత్రను స్వయంగా రాశారు. ఇది పుస్తకరూపంలో వచ్చిన తర్వాత ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే అందులో తన సినీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను యధాతథంగా రాయడం వల్ల ఆ వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయినా ఆరోజు జరిగిన వాస్తవ ఘటనల గురించే రాశాను అంటూ నిర్భయంగా సమాధానమిచ్చారు. సినీ కెరీర్ ప్రారంభం నుంచి చనిపోయే వరకు ఎం.ఎస్.రెడ్డి తన జీవనశైలిని ఏమాత్రం మార్చుకోలేదు. తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు. కవిగా, నిర్మాతగానే కాదు, నటుడిగా కూడా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ఎం.ఎస్.రెడ్డి జయంతి ఆగస్ట్ 15. ఈ సందర్భంగా ఆయన సాధించిన విజయాలు, ఆయన జీవితంలోని విశేషాల గురించి తెలుసుకుందాం.
ఎం.ఎస్.రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందరరామిరెడ్డి. 1924 ఆగస్ట్ 15న నెల్లూరులో జన్మించారు. ఆయన కలం పేరు మల్లెమాల. ఈ పేరుతోనే ఎన్నో కవితలు, సినీ గేయాలు రచించారు. ఆయన రాసిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. సహజకవిగా పేరు తెచ్చుకున్న ఎం.ఎస్.రెడ్డి ‘తెల్లా వారకముందే పల్లే లేచింది..తన వారినందరినీ తట్టీ లేపింది..’, ‘సన్నాజాజికి, గున్నామావికి పెళ్లి కుదిరింది.’, ‘సంగమం.. సంగమం.. అనురాగ సంగమం’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. దాదాపు 5,000 వరకు కవితలు, సినీ గేయాలు రచించారు ఎం.ఎస్.రెడ్డి. ఆ తర్వాత నిర్మాతగా మారి కౌముది ఆర్ట్స్ బేనర్‌ను స్థాపించి శ్రీకృష్ణ విజయం, ఊరికి ఉపకారి, కోడెనాగు, ముత్యాల పల్లకి, పల్నాటి సింహం, ఏకలవ్య వంటి మంచి సినిమాలను నిర్మించారు.
ఆ తర్వాత కుమారుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మాతగా, తన సమర్పణలో తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అరుంధతి వంటి సూపర్‌హిట్ సినిమాలను నిర్మించారు. అన్నింటినీ మించి బాలతారలతో శబ్దాలయా థియేటర్స్ పతాకంపై ‘రామాయణం’ చిత్రాన్ని నిర్మించారు ఎం.ఎస్.రెడ్డి. జూనియర్ ఎన్.టి.ఆర్.ను ఈ చిత్రం ద్వారానే పరిచయం చేశారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చడమే కాకుండా పాటలు, పద్యాలు కూడా రాశారు. ఈ సినిమా ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టింది. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రం అవార్డు, రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు దక్కాయి. అంకుశం చిత్రానికి ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది.
తను నిర్మించే ప్రతి సినిమానూ లాభాపేక్షతో కాకుండా ప్రజలకు ఏదో ఒక సందేశాన్ని అందిచాలన్న తపనతోనే నిర్మించేవారు. తన మనసుకు దగ్గరగా ఉన్న కథ అయితే అందులో పాటలు రాసేవారు. చిన్నతనం నుంచీ గాంధేయవాదిగా పేరు తెచ్చుకున్న ఎం.ఎస్.రెడ్డి తన ఆలోచనలకు దగ్గరగా ఉంది అనిపిస్తే ఆ పాత్రలో నటించేవారు. అలా చేసిన సినిమాయే ‘అంకుశం’. ఒక స్కూల్ మాస్టారుగా జీవితాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా ఆ సినిమాలో తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. సహజకవిగా, సామాజిక స్పృహ ఉన్న నిర్మాతగా అందరి మన్ననలు పొందిన ఎం.ఎస్.రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది తెలుగువన్.
Also Read