కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండా ప్రారంభమై ట్రెండ్ సెట్టర్ అయిన తొలి తెలుగు చిత్రం!
on Jun 27, 2021

ధవళ సత్యం దర్శకత్వం వహించగా 1980 ఆగస్ట్ 15న విడుదలై సంచనల విజయం సాధించిన చిత్రం 'యువతరం కదిలింది'. నవతరం పిక్చర్స్ పతాకంపై మాదాల రంగారావు కథను రాసి, సమర్పించిన ఈ చిత్రంలో ఆయనతో పాటు రామకృష్ణ, నారాయణరావు, మురళీమోహన్, రంగనాథ్, సాయిచంద్, ప్రభాకర్‌రెడ్డి, నాగభూషణం ప్రధాన పాత్రలు పోషించారు. టైటిల్ సాంగ్‌ను సి. నారాయణరెడ్డి రాసిన ఈ చిత్రంలో "ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో.." అనే మరో పాట ఆనాటి యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. ఆ పాట రాసింది అదృష్ట దీపక్. ఇది ఆయన తొలి సినీ గీతం. అప్పటికే ఆయన కథకుడు, బుర్రకథారచయిత, రంగస్థల నటుడు, గాయకుడు.
అదృష్ట దీపక్ రాసిన పాటతోటే ఈ సినిమా పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. టి. చలపతిరావు స్వరాలు కూర్చిన ఈ పాటను రామకృష్ణ, విజయలక్ష్మీ శర్మ బందం పాడగా రికార్డ్ చేశారు. 1980 మార్చి 26న మద్రాస్‌లోని విజయా గార్డెన్స్‌లో మొదలైన ఈ కార్యక్రమం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. కారణం.. పూజలూ, పురోహితులూ లేకుండా, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండా అది జరగడం. విపరీతమైన సెంటిమెంట్లకు ఆలవాలమైన సినిమా రంగంలో ఇలా చేయడం ద్వారా మాదాల రంగారావు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. "ఇలా జరగడం మొత్తం మద్రాసు చలనచిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి." అంటూ పత్రికలన్నీ ఆ సంఘటనను ప్రముఖంగా రాశాయి.
'ఆశయాల పందిరిలో..' పాట రికార్డింగ్ రోజునే యువతరం కదిలింది సినిమా విడుదల తేదీని కూడా ఆయన ప్రకటించారు. ప్రకటించిన విధంగానే అదే సంవత్సరం ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా అప్పుడు విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలను ఢీకొట్టి మరీ సెన్సేషనల్ హిట్టయింది. ఆ తరహా చిత్రాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



